మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్

Update: 2018-12-14 04:18 GMT

సీనియర్లు..జూనియర్ల మధ్య దోబూచులాడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం చివరకు సీనియర్ కే దక్కింది. దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైన నేతల్లో ఒకరుగా ఉన్న కమల్ నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పలు దఫాల చర్చల అనంతరం రాహుల్, సోనియా, ప్రియాంకాలు అందరూ కలసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పదవిపై ఆశపెట్టుకున్న జ్యోతిరాదియాత్య సింధియాకు నిరాశే ఎదురైంది. పలు ఊహాగానాలకు ముగింపు పలుకుతూ గురువారం అర్ధరాత్రి సమయంలో పార్టీ ట్వీటర్‌ హ్యాండిల్‌లో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథేనంటూ స్పష్టత ఇచ్చింది.

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమల్‌నాథ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ను కలవనున్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామనీ, సీఎం పదవి కోసం పరుగుపందెం ఏదీ జరగడం లేదని రాహుల్‌తో చర్చల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాహుల్‌తో సింధియా, కమల్‌నాథ్‌లు విడివిడిగా భేటీ అయిన అనంతరం ఇరువురితో కలిసి రాహుల్‌ ఫొటో తీసుకుని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘కాలం, ఓరిమి.. ఇవే అత్యంత శక్తిమంతమైన యోధులు’ అనే ప్రఖ్యాత రచయిత లియొ టాల్‌స్టాయ్‌ వ్యాఖ్యను ట్వీట్‌తో జతపరిచారు.

Similar News