చంద్రబాబుకు రిటైర్ మెంట్ వయస్సు వచ్చింది

Update: 2018-11-21 16:16 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెన్నయ్ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రిటైర్ మెంట్ వయస్సు వచ్చిందని అన్నారు. త్వరలోనే ఆయన ఇంటి బాట పట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీలో భవిష్యత్ జనసేనదే అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ పంచాయతీ సర్పంచ్ గా కూడా గెలవలేదు కానీ..ఏకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారని..ఏపీలో పరిస్థితి అలా ఉందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత తనను తాను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కోరకుంటున్నట్లు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎవరూ కొనలేరని వ్యాఖ్యానించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని తెలిపారు. తనపై ఉన్న కేసుల కారణంగా జగన్ కొన్ని అంశాల్లో నోరు విప్పలేని పరిస్థితి ఉందన్నారు.

జనసేనను పరిచయటం చేయటానికే తాను తమిళనాడు వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, బిజెపిలే కారణం అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వల్ల ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. ఏపీలోని ఒక్కో నియోజకవర్గంలో దాదాపు వెయ్యికోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు మిత్రుడు అవుతారో..ఎప్పుడు శత్రువు అవుతారో చెప్పలేమన్నారు. ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ, బీజేపీ కూటమి మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వారికి మద్దతు ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. అంబేద్కర్‌ చెప్పినట్లుగా దక్షిణాదిలో రెండో రాజధాని రావాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో అవసరమైతే రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో కలిసి కూడా పనిచేస్తానని పవన్‌ వివరించారు.

Similar News