2.ఓ మూవీ రివ్యూ

Update: 2018-11-29 05:03 GMT

ట్రైలర్ లోనే ఈ సినిమా స్టోరీ ఏంటో చెప్పేశారు దర్శకుడు శంకర్. ప్రస్తుతం ప్రపంచం అంతా సెల్ ఫోన్లకు బానిస అయిపోయింది. మెట్రో రైలులో అయినా..విమానంలో అయినా (అనుమతించినంత సేపు),, బస్సులో అయినా ఎవరైనా కూర్చుని ఉంటే వాళ్ళ తల వంగి ఉంటుంది. అది సెల్ ఫోన్ లో ఏదో చేస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు అవే దృశ్యాలు. ఈ అంశాన్నే టార్గెట్ చేసుకుని దర్శకుడు శంకర్ 2.ఓని తెరకెక్కించారు. సెల్ ఫోన్ల వాడకం వల్లే వచ్చే ప్రమాదాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు. సహజంగానే శంకర్ సినిమా అంటే అందులో భారీతనం ఉంటుంది. 2.ఓ సినిమాలో కూడా అదే కన్పిస్తునంది. శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ లు కలిస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండటమే సహజాతి సహజమే. దేశ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ అంటే దాదాపు 550 కోట్ల రూపాయలతో తెరకెక్కిన 2.ఓ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఇక రజనీకాంత్ ఫ్యాన్స్ కు అయితే ఇది ఓ పండగ రోజే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురుచూశారు కనుక. రజనీకాంత్, శంకర్ లు కలసి చేసిన రోబోకు సీక్వెల్ గానే 2.ఓ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక సినిమాలో అసలు కథ విషయానికి వస్తే అనుకోకుండా అందరి దగ్గర నుంచి సెల్ ఫోన్లు మాయం అయ్యే సమస్య ఎందుకు వచ్చింది. దానికి కాల కారణాలు ఏంటి? అన్న లైన్ తీసుకుని సినిమా కథను సిద్ధం చేశారు శంకర్. అందుకు కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో పడతాడు

డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌). అందులో భాగంగానే మళ్ళీ చిట్టికి ప్రాణం పోస్తాడు. నగరాల్లో ప్రజలు...షాప్ ల నిం సెల్‌ఫోన్లు మాయం చేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌)ను చిట్టి ఎలా ఎదుర్కొన్నది అన్నదే సినిమా. సినిమా అంతా రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల చుట్టూనే తిరుగుతుంది. సైంటిస్ట్‌ పాత్రలో వసీకరణ్‌గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు ఆకట్టుకుంటుంది. అక్షయ్‌కుమార్‌ నటన ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది. పక్షిరాజాలా అక్షయ్‌ నటన కూడా సినిమాలో హైలెట్. అక్షయ్‌ నటనలోని మరోకోణాన్ని శంకర్‌ అద్భుతంగా ఆవిష్కరించాడు. రోబోలో ఐశ్వర్యారాయ్ తో పోలిస్తే 2.ఓలో అమీజాక్సన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. దర్శకుడు శంకర్ తనదైన శైలిలో సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు అద్భుతం.

విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఏఆర్‌ రెహమాన్‌, రసూల్‌ పూకుట్టి చేసిన మాయ అందరినీ ఆకట్టుకుంటుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయగా.. ఇండియన్‌ సినిమాలో 4డీ సౌండ్‌ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్‌ తీసుకెళ్లారు. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్‌ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. కథ పరంగా పెద్దగా ఆకట్టుకునే అంశాలేమీ లేవు. సినిమాను డ్రైవ్ చేసింది విజువల్ ఎఫెక్ట్స్..గ్రాఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హైలెట్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల నటనే. ఈ సినిమాను సాంకేతికంగా ఆస్వాదించాల్సిందే. రోబోతో పోలిస్తే 2.ఓలో పాటలు పెద్దగా ఆసక్తికరంగా లేవు. ఓవరాల్ గాచూస్తే 2.ఓ ఓ విజువల్ వండర్.

రేటింగ్. 3.75/5

 

Similar News