నేను లేకపోతే జగనే సీఎం

Update: 2018-10-03 04:48 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను టీడీపీకి మద్దతు ఇచ్చి ఉండకపోతే అప్పుడే జగన్ సీఎం అయ్యేవారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాను, తప్పు చేశానని బాధపడుతున్నానన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు రూ.వేల కోట్లు దోచుకుతింటున్నారని, సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతోపాటు లోకేష్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కొడుకు లోకేష్‌ రాష్ట్రంలో 14వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెబుతున్నారని, అయితే జంగారెడ్డిగూడెం నుంచి ఐఎస్‌ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ట్రాఫిక్‌ లేని సమయంలో 14 కిలోమీటర్లు వెళ్లేందుకు తనకు 40 నిమిషాలు పట్టిందని, దీన్నిబట్టి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందని పవన్‌ అన్నారు.

చింతలపూడి పథకంలో రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వట్లేదని తప్పుపట్టారు. టీడీపీ నాయకులకైతే ఎకరానికి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఇస్తున్నారని, పేదల భూములకు రూ.10 లక్షలనుంచి రూ.12 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చింతలపూడిలో 42 ఎకరాల అటవీ భూమిని దెందులూరు ఎమ్మెల్యే కబ్జా చేశారన్నారు. బుట్టాయగూడెంలో 400 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించారని, దీనిపై విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్‌ చేశారు.

Similar News