అసెంబ్లీ రద్దుకు అంతా రెడీ

Update: 2018-09-05 04:17 GMT

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు రంగం సిద్ధం అయింది. గురువారం నాడు తెలంగాణ తొలి అసెంబ్లీ అర్థాంతరంగా రద్దు కానుంది. మంగళవారం నాడు ఈ దిశగా పలు పరిణామాలు చకచకా సాగాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ వరస పెట్టి భేటీలు..సమావేశాలు..చర్చలు జరిపారు. అంతిమంగా సెప్టెంబర్ 6న మంత్రివర్గం సమావేశం అయి అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ కు నమ్మకాలు ఎక్కువ. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని చెబుతున్నారు.

ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్‌ భేటీకి సీఎం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశం కాగా, ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. గురువారం శాసనసభ రద్దు ప్రకటన చేయటంతోపాటు.. శుక్రవారం కెసీఆర్ హుస్నాబాద్‌ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

Similar News