కరుణానిధి అస్తమయం

Update: 2018-08-07 14:28 GMT

తమిళనాడు రాష్ట్రం మరో పెద్ద దిక్కును కోల్పోయింది. గత ఏడాది అన్నాడీఎంకె అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించగా...2018 ఆగస్టులో డీఎంకె అధినేత కరుణానిధి అస్తమించారు. రెండేళ్ల వ్యవధిలోనే తమిళనాడు రాజకీయాల్లో ఉద్దండులైన ఇద్దరు నేతలు అస్తమించటంతో ఆ రాష్ట్రం పెద్ద దిక్కులను కోల్పోయినట్లు అయింది. 94 సంవత్సరాల వయస్సు ఉన్న కరుణానిధి మంగళవారం సాయంత్ర 6.10 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు గత కొన్ని రోజులు చికిత్స అందిస్తున్న కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణ వార్తతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

జూలై 24 నుంచి ఆయన కావేరి ఆస్పత్రిలో ఉన్నారు. కరుణానిధిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు సెలవు ప్రకటించింది. ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. కరుణానిధి ఏకంగా 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతే కాదు..ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. కరుణానిధి జూన్ 3, 1924న అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు.

Similar News