మోడీకి రాహుల్ మద్దతు

Update: 2018-07-16 13:40 GMT

అదేంటి?. నిత్యం మాటల తూటాలు పేల్చుకునే వీరిద్దరూ కలసిపోయారు అనుకుంటున్నారా?. అవును. ఓ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వటానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెడీ అయిపోయారు. భేషరతు మద్దతు ఇస్తానని ప్రకటించారు. మరి ఇక ముందడుగు వేయాల్సింది మోడీనే. ఈ సమావేశాల్లో అయినా గత కొన్నేళ్ళుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకుంటుందా? లేదో వేచిచూడాల్సిందే. ఈ బిల్లు విషయంలో తాము ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతే కాదు..రాజ్యసభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందిందని..లోక్ సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉందని..అయినా తాము కూడా దీనికి మద్దతు ఇస్తున్నందున మోడీ సర్కారు ఈ బిల్లు ఆమోదింపచేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు. ఈ మేరకు ప్రధానికి ఓ లేఖ కూడా రాశారు రాహుల్. 2010 మార్చి 9వ తేదీన మహిళ రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయిందనే విషయం మీకు తెలిసిందే.

కానీ ఎనిమిదేళ్లయినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ దీనిని చరిత్రాత్మక బిల్లుగా పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్‌ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. బీజేపీ కూడా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళ రిజర్వేషన్‌ బిల్లు గురించి పేర్కొంది. మోదీ తన ప్రసంగాల్లో మహిళ సాధికారత గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. మీ ఆశయాన్ని నేరవేర్చుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. బిల్లు ప్రవేశపెట్టడానికి వచ్చే పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల కన్నా మంచి సమయం ఉండదు. దీనిలో జాప్యం జరిగితే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బిల్లు ఆమోదం పొందడం అసాధ్యమవుతోందని అన్నారు. మరి రాహుల్ ఆఫర్ ను మోడీ వాడుకుంటారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే.

 

 

Similar News