మోడీ విదేశీ పర్యటనల ఖర్చు 355 కోట్లు

Update: 2018-06-28 15:08 GMT

నూట అరవై ఐదు రోజులు. 50 దేశాలు. 355 కోట్ల రూపాయల ఖర్చు. ఇదీ భారత ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన విదేశీ పర్యటనల ఖర్చు వ్యవహారం. ఈ విషయం కాస్తా సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చింది. 2014లో మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నాలుగేళ్లలో 50 దేశాలకు పైగా 41 విదేశీ పర్యటనలు చేశారు. బెంగళూర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే గత 48 నెలల్లో ప్రధాని విదేశీ పర్యటన వివరాలతో కూడిన జాబితాను ప్రదాని కార్యాలయ వెబ్‌సైట్‌ లో పెట్టారు. ఈ పర్యటనల్లో 30 సార్లు ప్రధాని ఉపయోగించిన చార్టర్డ్‌ విమానాల బిల్లులను ఖర్చుల జాబితాలో చూపగా, 12 ఈ తరహా పర్యటనల బిల్లులను ఇంకా అందులో పొందుపర్చలేదు. మోదీ విదేశీ పర్యటనల్లో ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు అత్యధికంగా రూ 31.25 కోట్లు ఖర్చు అయింది.

భూటాన్‌ పర్యటనకు కేవలం రూ 2.45 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలపై గత కొంత కాలంగా పెద్ద ఎత్తున విమర్శలు విన్పిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏకంగా సీతారాం ఏచూరి వంటి వారు అయితే..ప్రధాని మోడీకి విదేశీ పర్యటనలు అలవాటు అయి..పార్లమెంట్ లో కూర్చుని కూడా సీటు బెల్టు కోసం వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని విదేశీ పర్యటనలపై విమర్శలు గుప్పించింది. మరి విదేశీ పర్యటనల వ్యయం వెల్లడికావటంతో కాంగ్రెస్ తోపాటు మిగిలిన పార్టీలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.

 

Similar News