కర్ణాటకలో అసలు ఆట మొదలైంది ఇఫ్పుడే!

Update: 2018-05-15 15:22 GMT

కర్ణాటకలో మే 15తో సస్పెన్స్ కు తెరపడుతుందని అందరూ అనుకున్నారు. తెరపడకపోగా...అసలు ఆట ఇప్పుడే మొదలైందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత బిజెపి మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తుందని అందరూ భావించారు. కానీ అంతిమ పలితాలు తేలే సమయానికి 104 సీట్ల వద్దే బిజెపి ఆగిపోయింది. దీంతో ఎవరో ఒకరి మద్దతు లేకుండా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ఎలాగైనా బిజెపిని అధికారంలోకి రాకుండా నిలువరించాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము జెడీఎస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవి సైతం జెడీఎస్ కే అని స్పష్టం చేసింది. దీంతో సడన్ గా రాజకీయం కొత్త రూపు సంతరించుకుంది. కాంగ్రెస్ లేఖతో జెడీఎస్ నేతలు గవర్నర్ ను కలసి తమకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరింది. ఇరు పార్టీల వాదన విన్న గవర్నర్ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ తరుణంలో ఎక్కడ నుంచి ఎటువైపు ఫిరాయింపులు ఉంటాయి?. ఎవరు ఎవరితో కలుస్తారు? అన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో ‘బేరాలు’ కూడా నడుస్తున్నాయి. ఎవరికి వారు తమ తమ ప్రయత్నాల్లో బిజీగా ఉంటే..ప్రతి పార్టీ తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డాయి. ఇప్పుడు గవర్నర్ పిలుపే అత్యంత కీలకంగా మారనుంది. ఫస్ట్ ఛాన్స్ ఎవరికి వస్తుందో వేచిచూడాల్సిందే. ఈ నెల 12 న మొత్తం 222 సీట్లకు ఎన్నికలు జరగ్గా...మంగళవారం నాడు కౌంటింగ్ పూర్తయింది. బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించి 104 సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ 78 సీట్లు, జెడీఎస్ 38, ఇండిపెండెంట్లు 2 సీట్లు దక్కించుకున్నారు. జెడీఎస్ లో చీలిక కోసం బిజెపి ప్రయత్నిస్తోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 

Similar News