అప్పుడు టీడీపీ పవన్ ను ‘ఎంతకు కొన్నదో’!

Update: 2018-04-01 08:27 GMT

‘పవన్ కళ్యాణ్’ అమ్ముడుపోయాడు.’ ఇదీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని జనసేన అధినేతపై ఆదివారం నాడు చేసిన వ్యాఖ్యలు. చర్చ కోసం కాసేపు ఇది నిజమే అనుకుందాం. మరి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ పాటు పూర్తి మద్దతు ప్రకటించారు. చంద్రబాబుపై ఈగ వాలకుండా చూసుకున్నారు. ఎవరైనా అవినీతి ఆరోపణలు చేసినా కనీసం ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా ఒకింత విచిత్రంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఉద్ధానంతోపాటు మరికొన్ని సమస్యలు లేవనెత్తినప్పుడు అసలు ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మేం ఆమోదిస్తాం. అందుకే పవన్ లేవనెత్తిన సమస్యలు అన్ని పరిష్కరిస్తున్నాం. ఇదీ ప్రతిపక్షాలు ఉండాల్సిన పద్దతి అంటూ పవన్ పై ఏకంగా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిపక్షాలు పవన్ ను చూసి నేర్చుకోవాలంటూ చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు ఊదరకొట్టారు. . ఇప్పుడు కేశినేని నాని చెబుతున్నదే నిజమైతే...ఇప్పుడు పవన్ అమ్ముడుపోయినట్లు అయితే...అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా పవన్ ను కొనుగోలు చేసి పొగడ్తలు కురిపించుకున్నారా?.

అంటే చంద్రబాబు, నారా లోకేష్ పై విమర్శలు చేస్తే..అమ్ముడుపోయినట్లా?. చంద్రబాబు అవినీతి ప్రశ్నిస్తే ఇక అంతేనా?. ఇదే టీడీపీ నేతలు ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి అని పవన్ చూపించి మరీ చెప్పి..అకస్మాత్తుగా పవన్ పై అమ్ముడుపోయారని వ్యాఖ్యానించటంలో మతలబు ఏమిటి?. అంటే తమ పక్కన ఉన్నంత కాలం ఎవరైనా మంచోళ్లే. ఏ కారణంతో అయినా పక్కకు పోతే చాలు..తెలుగుదేశం పార్టీ ఎంత దుష్ప్రచారం అయినా చేయటానికి వెనకాడదు అనటానికి పవన్ కళ్యాణ్ ఉదంతం ఓ ప్రత్యక్ష ఉదాహరణ. అది మోడీ అయినా కావచ్చు...పవన్ కళ్యాణ్ అయినా కావొచ్చు. తమపై విమర్శలు చేయనంత వరకూ ఓకే. ఎవరైనా సరే చంద్రబాబు ను విమర్శిస్తే చాలు.. వారిని ఓ పక్కా ప్రణాళిక ప్రకారం బద్నాం చేసేస్తారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి ఉన్న ‘నైపుణ్యం’ బహుశా దేశంలో మరే పార్టీకి లేదనే చెప్పొచ్చు.

 

 

Similar News