చట్టసభల్లో ఆందోళనలపై ‘ కెసీఆర్ డబుల్ గేమ్’

Update: 2018-03-12 07:07 GMT

దేశ అత్యున్నత సభ అయిన పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోడియం దగ్గరకు పోయి నినాదాలు చేయవచ్చు. ప్లకార్డులతో తమ డిమాండ్లను లేవనెత్తొచ్చు. ఇలా చేయమని సాక్ష్యాత్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ పార్టీ సభ్యులకు చెబుతారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం నాడు కూడా టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ లో పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో తమ సమస్యలపై గళమెత్తుతామని ఎంపీలు కూడా పలుమార్లు ప్రకటించారు. ఈ పని టీఆర్ఎస్ సభ్యులు ఒక్కరే చేయటం లేదు. పలు పార్టీలు కూడా ఇదే వైఖరి అవలంభిస్తున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి అధికార టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోంది. అత్యున్నత చట్టసభ అయిన లోక్ సభలో మాత్రం ఎంపీలు పోడియం దగ్గరకు పోయి నినాదాలు చేయవచ్చు కానీ...అసెంబ్లీలో మాత్రం అలా చేస్తే సహించేదిలేదని..సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. గతంలోనూ సీఎం కెసీఆర్ సభ సాక్షిగా ఇదే అంశాన్ని పలుమార్లు ప్రకటించారు. మరి అసెంబ్లీలో సభ్యులు పోడియం వద్దకు పోయి నిరసన వ్యక్తం చేయటం తప్పు అయితే..లోక్ సభలో టీఆర్ఎస్ సభ్యులు అలా చేయటం తప్పు కాదా?. ఓ వైపు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి...మొత్తం వ్యవస్థలను మారుస్తామని చెబుతున్న కెసీఆర్ మరి లోక్ సభ, అసెంబ్లీల్లో నిరసనలపై ద్వంద వైఖరి అవలంభిస్తున్నారు.

2014 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో ఏ పార్టీ చేయని రీతిలో టీఆర్ఎస్ సభ్యులు చేసిన హంగామా అందరూ చూసిందే. టీఆర్ఎస్ గతంలో నిబంధనలు అన్నీ అడ్డగోలుగా ఉల్లంఘించి సభలో వ్యవహరించింది. ప్రస్తుత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు అయితే ఏకంగా గవర్నర్ నరసింహన్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు తోడు అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ కుర్చీని లాగి పక్కన పడేసి పెద్ద సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. కాంగ్రెస్ పాలనలో అసెంబ్లీని ఏ రోజు సజావుగా సాగనివ్వని టీఆర్ఎస్ ఇఫ్పుడు మాత్రం..అసలు ఎక్కడలేని ప్రజాస్వామ్య విలువల గురించి చెబుతోంది. అసెంబ్లీ అప్పుడు అయినా అసెంబ్లీనే...ఇప్పుడు అయినా అసెంబ్లీనే. కానీ మారింది టీఆర్ఎస్ వైఖరి తప్ప..మరొకటి కాదు.

 

Similar News