హోదా కోసం ‘జంతర్ మంతర్’ దగ్గర వైసీపీ ధర్నా

Update: 2018-02-12 15:53 GMT

ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రతిపక్ష వైసీపీ కార్యాచరణ ప్రణాళికను రెడీ చేసింది. సోమవారం నాడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశం అయిన పలు అంశాలపై చర్చించారు. ఇందులోనే ఏపీతో పాటు ఢిల్లీలోనూ ధర్నాలకు నిర్ణయం తీసుకున్నారు. ఎంపీల రాజీనామా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే కేంద్రం హోదా ఇవ్వం అని చెపితే వెంటనే రాజీనామా చేస్తామనే ‘కొత్త మెలిక’ను తీసుకొచ్చారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు’ అనే నినాదంతో మార్చి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సమావేశం వివరాలను ఆయనే మీడియాకు వివరించారు. ‘ జగన్ అధ్యక్షతన పార్టీ నాయకులతో కీలక సమావేశం జరిగింది. ముఖ్య నిర్ణయంగా మార్చి1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు అనే నినాదంతో ధర్నాలు చేయాలని నిర్ణయించాం.

మార్చి 5వ తేదీన ‘ప్రత్యేక హోదా మన హక్కు- ప్యాకేజి మాకొద్దు’ అన్న నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలసి ధర్నా చేస్తాం. దీనికి సంబంధించి మార్చి 3వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ జెండా ఊపి నాయకులను ఢిల్లీకి పంపుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకూ వైఎస్‌ఆర్‌సీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్రమించబోదు. ప్రత్యేక హోదా సంజీవని అని, దాని వల్ల రాష్ట్ర ప్రజానీకానికి ఎనలేని ప్రయోజనాలు ఒనగూరుతాయని చెప్పింది ఒక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే. ప్రత్యేక హోదాకు సమాధి కట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్న సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ మళ్లీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వాల మీద తిరగబడటం ప్రతిపక్షాల లక్షణం. దృఢమైన సంకల్పం ఉంది కాబట్టే మేం ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తున్నాం. ఫలితం రానటువంటి పరిస్థితుల్లో ఎంపీలు కచ్చితంగా రాజీనామా చేస్తారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గతంలోనే స్పష్టమైన ప్రకటన చేశారు.’ అని తెలిపారు.

 

 

 

Similar News