‘పొలిటికల్ యాత్ర’కు పవన్ రెడీ

Update: 2018-01-20 15:37 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ‘మరో రాజకీయ యాత్ర’కు రంగం సిద్ధం అయింది. ఇంత కాలం అటు సినిమాలు..ఇటు రాజకీయాలు అంటూ రెండు రెండు పడవలపై కాళ్లు పెట్టి ముందుకు సాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక పూర్తి స్థాయి రాజకీయాలకు రెడీ అయిపోయారు. అందులో భాగంగానే యాత్ర ప్రారంభిస్తున్నానని...ఆశీర్వాదించాలంటూ ప్రజలను కోరారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసి, అవగాహన పెంచుకోవడం కోసమే యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలోని కొండగట్టు అంజన్న దేవాలయం నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

యాత్ర తేదీలు ఇంకా ఖరారుకాలేదని, త్వరలోనే వివరాలు చెబుతానన్నారు. 2009లో తన సోదరుడు, మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల ప్రచారంలో జరిగిన పెను ప్రమాదం నుంచి తాను బయటపడింది కొండగట్టులోనేనని. పైగా, ఆంజనేయుడు తమ ఇంటి ఇలవేల్పు కూడా అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. . అందుకే ఇక్కడి నుంచి యాత్రను ప్రారంభిస్తానని తెలిపారు. తన రాజకీయ ప్రణాళికను కొండగట్టులోనే ప్రకటిస్తానని వెల్లడించారు.

 

 

Similar News