తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించటానికి చంద్రబాబు హైదరాబాద్ రాకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయన వస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం లేదనే ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ఇఫ్పుడు చాలా ఇబ్బందుల్లో ఉందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఇంకా ముందుకు తీసుకెళ్లి కాపాడుకోవాల్సి ఉంది. ఎన్ని పనులు ఉన్నా..ఎన్టీఆర్ ఘాట్ ఇక్కడ ఉంది కాబట్టి చంద్రబాబు ఓ నిమిషం పాటు అయినా ఇక్కడికి వచ్చిపోయి ఉంటే బాగుండేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ రోజురోజుకు అంతరించిపోతుందనే అనే ప్రచారం బాధగా ఉందన్నారు. ఎన్టీఆర్ తెలంగాణలోనే పార్టీ పెట్టారు. ప్రజలకు స్వేచ్చనిచ్చారు పటేల్..పట్వార్వీ వ్యవస్థలను రద్దు చేశారు. ఇలాంటి పార్టీ ఉండదనే ప్రచారం బాధగా ఉంది. రెండు రాష్ట్రాలు బాగుండాలి. కెసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయిన వ్యక్తే. మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్న నాయకుడే.
తెలంగాణ మంత్రులు కూడా మన వాళ్లే. 40లక్షల ఓటర్ దేవుళ్ళను కాపాడుకోవాలి. మీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉంటూ టీఆర్ఎస్ లో విలీనం చేయగలిగితే గౌరవంగా ఉంటుందనే నా అభిప్రాయం. ఓ మిత్రుడికి సాయం చేసినట్లు అభిప్రాయం వస్తే ఇద్దరికీ మంచిది. ఏదో రాజకీయ లక్ష్యంతో చెప్పటం లేదు. ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతించాలంటే టీఆర్ఎస్ లో విలీనం చేయటం గౌరవంగా ఉంటుంది. లేదంటే చంద్రబాబు స్వయంగా రథం వేసుకుని తిరిగి పార్టీని తిరిగి పట్టాలపైకి తేవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ లో విలీనం చేసి...ఏపీలో..తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉంటే బెటర్. తాను ఏదో రాజకీయ పదవులు ఆశించో లేక మరో కారణంతో ఇలా చెప్పటం లేదు అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది.