విమానంలో లైంగిక వేధింపులు

Update: 2017-12-10 13:37 GMT

భూమి మీదే కాదు..ఆకాశంలోనూ అమ్మాయిలపై వేధింపులు ఆగటం లేదు. అది సెలబ్రిటీలు అయినా..సామాన్యులు అయినా ఒకటే అన్న చందంగా ఉంది పరిస్థితి. బాలీవుడ్ నటి జైరా వసీమ్ విస్తారా ఎయిర్ లైన్స్ లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. విమానంలో తనకు ఎవరూ సాయం చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలపై ఎయిర్ లైన్స్ అధికారులు రియాక్ట్ అయ్యారు. ముంబైలో విమానం దిగే వరకూ తనపై జరిగిన లైంగిక వేధింపుల విషయాన్ని సిబ్బంది దృష్టికి జైరాగానీ, ఆమె తల్లి గానీ తీసుకురాలేదని తెలిపారు. మాకు విషయం తెలిసిన వెంటనే వారిని సంప్రదించాం. ఫిర్యాదు చేయాలనుకుంటే సహకరిస్తామని ఎయిర్‌ లైన్స్ సిబ్బంది చెప్పగా అందుకు జైరా, ఆమె తల్లి నిరాకరించినట్లు ఆ అధికారి వెల్లడించారు.

నటికి ఎదురైన వేధింపుల వివాదం సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ముంబయ్ పోలీసులు కూడా స్పందించారు. జైరా వసీమ్‌ను ప్రత్యేకంగా కలిసిన ముంబై పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి సీటుపై కాలుపెట్టి, అసభ్యంగా తాకాడని ఆమె ఓ వీడియో ద్వారా ఆరోపించగా వేధింపుల ఘటన వెలుగుచూసింది. ఈ మధ్య కాలంలో తరచూ విమానాల్లో లైంగిక వేధింపుల వ్యవహారం నిత్యకృత్యంగా మారింది.

 

 

Similar News