గుజరాత్ సీఎం పీఠంపై మళ్లీ రూపానీనే

Update: 2017-12-23 03:28 GMT

గుజరాత్ లో గెలిచేందుకు నానా కష్టాలు పడ్డ బిజెపి పెద్దగా సంచలనాలు లేకుండా కొత్త సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అత్యంత విధేయుడైన విజయ్‌ రూపానీనే తిరిగి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం గుజరాత్‌ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యులతో భేటీ తర్వాత పార్టీ కేంద్ర పరిశీలకుడు అరుణ్‌ జైట్లీ ఈ వివరాలు వెల్లడించారు. శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్‌ పటేల్‌ను ఎన్నుకున్నారని తెలిపారు. గుజరాత్‌ ఎన్నిక ల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవ సం చేసుకున్నా తక్కువ మెజార్టీతో గట్టెక్కింది.

ఈ నేపథ్యంలో రూపానీని మరోసారి సీ ఎంగా కొనసాగించే అంశంపై తొలుత ఊహాగానాలు కొనసాగాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఉప నేత పదవులకు రూపానీ, పటేల్‌ పేర్లను ఎమ్మెల్యే భూసేంద్ర సిన్హ్‌ చుదాసమ సూచించారని.. మరో ఐదుగురు సభ్యులు చుదాసమ ప్రతిపాదనను సమర్ధించారన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రూపానీ సంప్రదింపులు జరుపుతారని జైట్లీ చెప్పారు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో.. 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. ఇక మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్‌ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ 80 స్థానాల్లో విజయం సాధించింది.

 

 

 

Similar News