‘స్మృతి ఇరానీ’పై సోషల్ మీడియాలో సెటైర్లు

Update: 2017-12-19 14:47 GMT

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ మధ్య కాలంలో ఏ కేంద్ర మంత్రి ఎదుర్కొనంత దాడిని ఎదుర్కొన్నారు. అదీ సోషల్ మీడియాలో. సహజంగా స్మృతి ఇరానీ మంచిగా మాట్లాడతారని పేరుంది. కానీ ఒక్కో సారి ఎవరికైనా చిక్కులు తప్పవంటే ఇదేనేమో. జీఎస్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాదు..ఆమె వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా అదే స్థాయిలో వచ్చిపడ్డాయి. ఓ వైపు జీఎస్టీతో చిన్న వ్యాపారులు మొదలుకుని..పెద్ద వాళ్ళ వరకూ నానా అవస్థలు పడుతున్నారని..ఇదంతా ఒకెత్తు అయితే ప్రజలు భారీ ఎత్తున భారాన్ని మోయాల్సి వస్తోందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ తరుణంలో స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు అసంతృప్తులకు మంచి అస్త్రంగా అందివచ్చాయి. అంతే తమ తడాఖా ఏంటో చూపించారు అదేంటో మీరూ చూడండి. దేశంలో జీఎస్టీని అమలు చేస్తున్నప్పటి నుంచి ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని స్మృతి ట్వీట్ చేశారు. ముఖ్యంగా చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఉద్యోగాలకు యమ డిమాండ్‌ పెరిగినట్లు ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌’ వెల్లడించిందంటూ ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్‌పై వరుసగా వ్యంగ్య ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. స్మృతి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే పెనుభూకంపం వస్తే పలు భవనాలు కూలిపోయి, భవన నిర్మాణ రంగంలో భారీగా ఉద్యోగాలు పెరుగుతాయని అన్నట్లు ఉందని కొందరు వ్యాఖ్యానించారు.

డెంగ్యూ రావడం వల్ల ప్రైవేట్‌ ఆస్పత్రులకు డిమాండ్‌ పెరిగిందన్నట్లు ఉందని మరికొందరు వ్యంగ్యోక్తులు విసిరారు. టెర్రరిస్టులు ప్రజలను చంపడం వల్ల శ్మశానంలో కార్మికుల సంఖ్య పెరుగుతుందని మరికొంత మంది వ్యాఖ్యానించారు. ప్రమాదాల వల్ల ఆస్పత్రుల వ్యాపారం పెరుగుతుందని, అగ్నిమాపక ప్రమాదాలు జరగడం వల్ల అగ్నిమాపక దళాలకు డిమాండ్‌ పెరుగుతుందని, వరదల వల్ల ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో ఉద్యోగాలు పెరుగుతాయని సంబురపడినట్లు ఉందని కొందరు కామెంట్లు పెట్టారు. ‘దయచేసి మీరు రాజీనామా చేయండి. మీ వల్ల కేంద్ర కేబినెట్‌లో ఓ ఉద్యోగి పెరుగుతారంటూ మరొకరు కాస్త ఘాటుగా స్పందించారు. దేశంలో నకిలీ డిగ్రీలు బీజేపీకీ ఉద్యోగాల ఊపును తీసుకొచ్చిందని ఒకరు వ్యాఖ్యానించారు.జీఎస్టీ వల్ల సీఏ ఉద్యోగాలు పెరిగాయన్న విషయాన్ని యేల్‌ యూనివర్శిటీలో నేర్చుకున్నారా? అంటూ మరొకరు ప్రశ్నించారు. ఆ యూనివర్శిటీలో ఆమె ఆరు రోజుల డిగ్రీ చదివినట్లు వార్తలొచ్చిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో ఎవరూ సోషల్ మీడియాలో ఈతరహా దాడిని ఎదుర్కొని ఉండరు.

 

 

 

Similar News