ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్. దాణా కుంభకోణంలో ఆయన్ను కోర్టు దోషిగా ప్రకటించింది. జనవరి 3న ఆయనకు విధించే పనిష్మెంట్ తేలనుంది. దాణా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడే క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు తేజస్వి యాదవ్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున్న కోర్టు వచ్చారు. రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులు ప్రకటించగా.. లాలూతో సహా 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. ఇప్పటికే అనర్హత వేటు ఎదుర్కొంటున్న లాలూకు ఈ తీర్పు మరింత ప్రతికూలంగా మారింది.
1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు బిహార్ మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ మిశ్రాలతో సహా 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.అయితే ఈ తీర్పుపై లాలూ స్పందించారు. ఇది కేవలం బిజెపి ఆడుతున్న డర్టీ గేమ్ అని తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు తీర్పు సరిగా లేదని..దీనిపై తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటూ ఆరోపించారు. కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడింది.