భారత్ లోనూ త్వరలో సముద్రంలో రన్ వే రానుంది. అదే సీ బ్రిడ్జ్ రన్ వే. లక్ష్మద్వీప్ విమానాశ్రయంలో ఈ సీ బ్రిడ్జ్ రన్ వే అనుమతులు వచ్చాయి. దీంతో త్వరలోనే ఇది సాకారం కానుంది. దీనికి ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా అనుమతి మంజూరు చేసింది. త్వరలోనే ఈ ద్వీపం నుంచి పెద్ద ఎటీఆర్ లు ఎగిరేందుకు వీలుగా రీఇన్ ఫోర్స్ డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్ సీసీ) ఫ్లాట్ ఫాం రెడీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు 1500 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఇదే తరహా ప్రతిపాదన జుహు ఎయిర్ పోర్టులో అనుకున్నారు. అయితే ఇది అంత అనుకూలంగా లేదని తేలటంతో ఇప్పుడు ఈ ప్రతిపాదనను లక్ష్మద్వీప్ లోని అగట్టీ విమానాశ్రయానికి మార్చారు.
ఇది అమల్లోకి వస్తే పర్యాటకులకు కొత్త అనుభూతి రావటం ఖాయం. హాంకాంగ్ విమానాశ్రయం సముద్రంలోనే ఉంటుంది. సముద్రంలో కొంత భాగాన్ని పూడ్చి విమానాశ్రయాన్ని నిర్మించారు అక్కడ. భారత్ లో ఆ తరహా కాకపోయినా సముద్రంలో ఓ రన్ వే ఏర్పాటు చేయనుండటం మాత్రం పర్యాటక రంగానికి కొత్త ఊతం ఇస్తుందని అంచనా వేస్తున్నారు.