ఏక్ సమోసా...చాయ్ లావ్. ఇది హైదరాబాద్ లో నిత్యం మనకు వినపడే మాట. సమోసా మనకు చాలా కామన్. ఎక్కువ మంది ఇష్టంగా తినే చిరుపదార్ధం. సమోసాల్లోనూ పలు రకాలు ఉన్నాయి. అయితే మన సమోసా ఇప్పుడు అంతర్జాతీయంగానూ కాలరెగేసింది. పోటీలో మొదటి స్థానంలో సత్తా చాటింది సమోసా. ఇది ఎక్కడ అంటారా?. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ పోటీ లో మన వంటకం చిల్లీ చికెన్ సమోసా విజేతగా నిలిచింది. భారతీయ సంతతి కోసం నిర్వహించే పత్రిక వీక్లీ పోస్ట్ నిర్వహించిన ఈ పోటీలో చాక్లెట్, జీడిపప్పు, ఇతర నోరూరించే వంటకాలతో పోటీ పడిన చిల్లీ చికెన్ సమోసా భోజనప్రియుల మన్ననలు పొందింది.
బాదంపప్పు, జీడిపప్పులు సహా పలు రుచులతో చిల్లీ చికెన్ సమోసాను తయారు చేశారు. సంప్రదాయ పంజాబీ స్నాక్‌గా పేరొందిన సమోసా వంటకాన్ని పోటీకి నిలిపిన సల్మా అజీ పోటీలో గెలుపొందారు. తాను వంట చేయడాన్ని ఇష్టపడతాననీ, ప్రతి వంటకానికీ మరింత మెరుగులు దిద్ది మరింత రుచికరంగా చేస్తానని సల్మా చెప్పారు. తాను మొదట పిల్లల కోసం చికెన్ శాండ్‌విచ్ చేశానని ఆ తర్వాత చిల్లీ చికెన్ సమోసాను కనిపెట్టానన్నారు. కాశ్మీరీ కారం పొడితో చికెన్‌ను వండినట్టు చెప్పారు. ఇదే కాంటెస్ట్ మరో క్యాటగిరీలో ఒకే నిమిషంలో పది సమోసాలు తిన్న ఇబ్రహీం బక్స్ ఫాస్టెస్ట్ సమోసా ఈటర్ టైటిల్ దక్కించుకున్నాడు.