ఇన్ఫోసిస్ కొత్త బాస్ వచ్చారు

Update: 2017-12-02 11:31 GMT

దేశంలోని అగ్రశ్రేణి ఐటి కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లో కీలక పరిణామం. ఈ సంస్థకు కొత్త బాస్ వచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పరిణామాల తర్వాత ఇన్ఫోసిస్ అంతా సాఫీగా చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే కొత్త సీఎండీని ఎంపిక చేశారు. సలీల్‌  ఎస్ పరేఖ్‌ను ఇన్ఫీ కొత్త సీఎండీగా ఎంపిక చేసినట్టునట్లు ఇన్ఫోసిస్  శనివారం ప్రకటించింది. ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా, ఎండీగా బలమైన ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న పరేఖ్‌ చేరడం ఆనందంగా ఉందని, ఐటీ సేవల పరిశ్రమలో మూడు దశాబ్దాల గ్లోబల్‌ అనుభవం ఆయనకు ఉందని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని వ్యాఖ్యానించారు.  ఇన్ఫీని నడిపించడంలో ఆయనే సరైన వ్యక్తిగా బోర్డు భావించింది. అలాగే  కీలక పరిణామ సమయంలో సీఈవోగా బాధ్యతలు నిర్వహించిన యూబీ ప్రవీణ్‌రావుకు బోర్డు  అభినందనలు తెలిపింది. 

                                  ఇన్ఫోసిస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) గా  పరేఖ్‌ ను కంపెనీ నియమించింది. జనవరి 2 నుంచి పరేఖ్ బాధ్యతలు చేపట్టనున్నారని  వెల్లడించింది. సీఈవో ప్రవీణ రావు స్థానంలో  పరేఖ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం, పరేఖ్ ఫ్రెంచ్ ఐటీ సేవల కంపెనీ క్యాప్‌ జెమినిలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడుగా ఉన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ , మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. అలాగే  బొంబాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ కూడా చదివారు. మరోవైపు నందన్ నీలేకని  నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. అలాగే ఇన్ఫోసిస్  మధ్యంతర  సీఈవో ప్రవీణ్ రావు సంస్థ  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పునఃనియమితులవుతారు. బోర్డు పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతారు.

 

 

Similar News