గత మూడున్నర సంవత్సరాల కాలంలో మోడీ సర్కారు ‘ప్రచారం’ కోసం చేసిన వ్యయం అక్షరాలా 3755 కోట్ల రూపాయలు. ఇది అధికారిక సమాచారం. సమాచార హక్కు కార్యకర్త ఒకరు ఈ వివరాలు సమాచార హక్కు చట్టం కింద తెలుసుకున్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2017 అక్టోబర్ వరకూ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఔట్ డోర్ పబ్లిసిటీ ప్రచారాల కోసం ఈ మొత్తం ఖర్చు చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియాపై 1656 కోట్లు, ప్రింట్ మీడియాపై 1698 కోట్లు, ఔట్ డోర్ ప్రచారం, ఇతర బుక్ లెట్ల కోసం 399 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
కొన్ని శాఖలు తమ బడ్జెట్ కేటాయింపులకు మించి మరీ ప్రచారంపై ఖర్చు చేశాయి. 2014 జూన్ 1 నుంచి 2016 ఆగస్టు 31 వరకూ కేవలం టెలివిజన్, ఇంటర్నెట్, ఇతర ఎలక్ట్రానియ్ మీడియాలో ప్రధాని నరేంద్రమోడీ ఫోటోలతో ప్రచారం చేశారు. దీనికి 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో ఔట్ డోర్, ప్రింట్ ప్రకటనల వ్యయం లేదు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతి నెల నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం కోసం 2015 జూలై వరకూ 8.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.