ఓ విద్యార్థి ఏకంగా క్లాస్ రూమ్ లోనే సహచర విద్యార్థిని కౌగిలించుకున్నాడు. అంతే కాదు...ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాడు. అంతే అది వైరల్ గా మారింది. ఈ సంఘటన జరిగిన చాలా రోజులు అయింది. అయితే దీనికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు..పాఠశాల యాజమాన్యం వాదనలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని ఓ పాఠశాల్లో 16 సంవత్సరాల విద్యార్థి ఓ అమ్మాయిని హగ్ చేసుకోవడమే కాకుండా.. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో సస్పెండ్ అయ్యాడు. అయితే తన కొడుకు జీవితం కోసం అతగాడి తండ్రి ఉద్యోగం మానేసి మరీ కోర్టుల చుట్టు తిరిగాడు. తన కొడుకు జీవితం పాడవుతుందని భావించిన ఆ విద్యార్థి తండ్రి స్కూల్ సస్పెన్షన్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ గత ఆగస్టులో కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా కోర్టు ఆ సస్పెన్షన్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ.. . విద్యార్థుల క్రమశిక్షణ విషయం పాఠశాల ప్రతిష్టపై ఆధారపడి ఉంటుందని..ఆ పేరు చెప్పి పరీక్షలు రాయకుండా సస్పెండ్ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది.
అవసరమైతే విద్యార్థుల తల్లితండ్రులకు జరిమానా సూచిస్తూ తీర్పునిచ్చింది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ విద్యార్థిని పరీక్షలకు అనుమతించే అంశం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. ‘ఈ విషయంలో క్షమాపణ చెప్పినప్పటికీ నన్ను ఓ రేపిస్టు అని పిలుస్తున్నారు. పరీక్షలు రాయకుంటే ఒక ఏడాది వృథా అవుతుంది. అది నేను ఊహించలేను. నాకు బోర్డు పరీక్షలు రాయలనుంద’ని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. చదువుకునే హక్కు రాజ్యంగం కల్పించిందని, తన కుమారుడి వ్యక్తిగత హక్కును ఉల్లంఘిస్తూ పాఠశాల యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుందని విద్యార్థి తండ్రి వాదిస్తున్నాడు. అయితే దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.