భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ గుజరాత్ లో బిజెపినే గెలుస్తందని ఢంకా బజాయించి చెప్పగా...ఫలితాలు మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగటంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఓ దశలో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల మేర నష్టపోయింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో ఫలితాలు ప్రతికూలంగా వస్తే ఈ ప్రభావం భవిష్యత్ సంస్కరణలపై ఉంటుందని అంచనాతో పతనం మొదలైంది.
రాబోయే రోజుల్లో ఎన్నికల లక్ష్యంగానే నిర్ణయాలు ఉంటాయనే ఉద్దేశంతో భారీ ఎత్తున అమ్మకాలు సాగాయి. తర్వాత కొంత రికవరి జరిగినా..మార్కెట్లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి బిజెపి వంద సీట్లలో లీడ్ తో ఉండగా..కాంగ్రెస్ 80 సీట్లలో మెజారిటీతో ఉంది. అంతిమ ఫలితాలు తేలిన తర్వాత మార్కెట్లు సర్దుబాటుకు గురయ్యే అవకాశం ఉంది.