పర్యాటకుల స్వర్గథామం దుబాయ్ సిగలో కొత్త ఎట్రాక్షన్. అదే దుబాయ్ ప్రేమ్. కొత్త సంవత్సరం అంటే 2018 జనవరి నుంచి ఈ ప్రాజెక్టు పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఈ సమయంలోనే దుబాయ్ లో అత్యంత హంగామా జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కూడా ప్రారంభం అయ్యే విషయం తెలిసిందే. సుమారు 300 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. బుర్జ్ ఖలీఫా తరహాలోనే దుబాయ్ ఫ్రేమ్ ఎక్కి పర్యాటకులు కొత్త దుబాయ్, పాత దుబాయ్ అందాలను వీక్షించవచ్చు. ఇక్కడ నుంచి 360 డిగ్రీ వ్యూలో చూడొచ్చు. 93 మీటర్ల గ్లాస్ బ్రిడ్జిపై నడుస్తూ ఓ వైపు నుంచి పాత దుబాయ్ ని, మరో వైపు నుంచి కొత్త దుబాయ్ ను చూడొచ్చు.
దుబాయ్ ఫ్రేమ్ లో రెండు 150 మీటర్ల ఎత్తైన టవర్స్ ఉంటాయి. దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రీ టిక్కెట్స్ పెద్దలకు భారతీయ కరెన్సీలో అయితే 870 రూపాయలు, పిల్లకు 520 రూపాయలుగా నిర్ణయించారు. కొత్త ప్రాజెక్టు పర్యాటకులను నూతన అనుభూతిని ఇవ్వటం ఖాయం అని నిర్వాహకులు భావిస్తున్నారు. బంగారు పూతతో ఈ దుబాయ్ ఫ్రేమ్ ను రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. కొత్త సంవత్సరంలో పర్యాటకులకు కొత్త అనుభూతులు అందివ్వటానికి దుబాయ్ ఫ్రేమ్ రెడీ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఫెర్నాండో డొనిస్ డిజైన్ చేశారు.