ఒక్క దెబ్బ. అందరూ అవాక్కు. అంతే కాదు ఏక కాలంలో మూడు వికౌట్లు డౌన్. అటు కేంద్రంలో అప్రతిహత అధికారం చెలాయిస్తున్న బిజెపికి..రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐడీఎంకెకు...వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆశ పడుతున్న డీఎంకెకు ఇది ఏ మాత్రం మింగుడుపడని పరిణామమే. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ వీరందకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు. దివంగత సీఎం జయలలిత ఎక్కువ మెజారిటీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అధికార అన్నాడీఎంకె, డీఎంకె అభ్యర్థులను మట్టికరిపించి 40707 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. ఎలాగైనా తమిళనాడులో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న బిజెపికి ఆర్కే నగర్ ఓటర్లు భారీ షాకే ఇఛ్చారు. నోటా కంటే తక్కువ ఓట్లు వేసి బిజెపి స్థానం ఏంటో చెప్పకనే చెప్పారు. ఆర్కే నగర్ లో నోటాకు 2373 ఓట్లు వస్తే బిజెపికి 1417 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించటం విశేషం. మొత్తం 19 రౌండ్లలోనూ దినకరన్ తన ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. దినకరన్ గెలుపుతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అధికార పక్షానికి చెందిన పదిమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.