హైదరాబాద్ మెట్రో లో భారీ రద్దీ కొనసాగుతోంది. నిత్యం లక్షల మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. ఈ తరుణంలో అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఆదివారం నాడు ఊహించని కలకలం. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో బాంబు ఉందని ఫోన్ చేయటంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. సత్వరమే అమీర్ పేట స్టేషన్ కు చేరుకున్న భద్రతా దళాలు క్షుణ్ణంగా పరిశీలించి..అక్కడ బాంబు లేదని తేల్చటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బాంబు నిర్వీర్య దళంతో పాటు జాగిలాలు కూడా రంగ ప్రవేశం చేశాయి.
అయితే స్టేషన్ లో గుర్తుతెలియని బ్యాగు కన్పించటంతో కలకలం రేపింది. బ్యాగ్ ను సోదా చేయగా..అందులో ఏమీ లేదు. అయితే బ్యాగ్ మెట్రోస్టేషన్ సిబ్బందికి చెందిందని గుర్తించారు. మెట్రోతో ఏర్పడిన క్రేజ్ తో చాలా మంది సరదాగా మెట్రో ప్రయాణం చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. అందుకే వారంతాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోంది. అలాంటి తరుణంలో ఆదివారం నాడు బాంబు బెదిరింపు కాల్ రావటంతో పోలీసులు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు.