సామాన్యుడి ఎయిర్ లైన్స్ మళ్లీ వస్తోంది

Update: 2017-12-13 07:24 GMT

దేశంలో సామాన్యుడికి కూడా విమానయానం అందుబాటులోకి తెచ్చిన తొలి సంస్థ ఏదైనా ఉంది అంటే..అది ఎయిర్ డెక్కన్ అని చెప్పొచ్చు. నో ఫ్రిల్స్ ఎయిర్ లైన్ గా వచ్చి..అప్పటి వరకూ అసలు విమానం ఎక్కని ఎంతో మందికి విమానయానం చేసే అవకాశం కల్పించిన సంస్థ అది. తర్వాత కాలంలో పలు సంస్థలు ఇదే బాట పట్టాయి. దీనికి తోడు పోటీ పెరగటంతో పలు ఎయిర్ లైన్ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాయి. కొంచెం ముందు బుక్ చేసుకుంటే దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయ్, చెన్నయ్, బెంగుళూరు వంటి ప్రాంతాలకు కేవలం రెండు వేలతోనే హైదరాబాద్ నుంచి ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. దీనికి తోడు ఆఫ్ సీజన్ లో వచ్చే ఆఫర్లు కూడా తొలిసారి విమానయానం చేయాలనుకునేవారికి ఓ మంచి అవకాశంగా నిలుస్తున్నాయి.

దేశ విమానయాన రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువైన ఎయిర్ డెక్కన్ మళ్లీ తన సర్వీసులు ప్రారంభించనుంది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. కెప్టెన్ గోపీనాథ్ ఈ ఎయిర్ లైన్స్ ను ప్రారంభించగా...తర్వాత దీన్ని విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ టేకోవర్ చేసింది. తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కూడా గోపీనాథే ఈ ఎయిర్ లైన్స్ సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నారు. డిసెంబర్ 22 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో ఉడాన్ పథకం ఉన్న రూట్లలోనే ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. అయితే క్రమంగా ఎయిర్ డెక్కన్ తన సర్వీసులను విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

 

Similar News