రెండాకుల గుర్తు అధికార కూటమికే

Update: 2017-11-23 10:41 GMT

తమిళనాడులో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. శశికళ వర్గానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం అన్నాడీఎంకెకు చెందిన రెండాకుల గుర్తును పళని-పన్నీర్ గ్రూపులకు చెందిన పార్టీకే కేటాయించింది. ఈ గుర్తు తమకే దక్కాలంటూ దినకరన్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పళని-పన్నీర్ వర్గాలు కూడా రెండాకుల గుర్తు తమకే దక్కాలని వాదించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం రెండాకుల గుర్తును పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు అయింది.  జయలలిత మరణత తర్వాత ఆమె సన్నిహితురాలు అయిన  శశికళ నటరాజన్‌ సీఎం కుర్చీ కోసం యత్నించటం తెలిసిందే.

                              పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లటం.. పళనిసామి ముఖ్యమంత్రి కావటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి పన్నీర్‌ వర్సెస్‌ పళని వర్సెస్‌ శశికళ-దినకరన్‌ వర్గ పోరుతో  అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ఇక ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక సమయంలో పార్టీ గుర్తు కోసం శశికళ-దినకరన్‌, పళని, పన్నీర్‌ వర్గాలు ఈసీని ఆశ్రయించటంతో ఆ సమయంలో గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేశారు. తర్వాత ఓపీఎస్‌, ఈపీఎస్‌ వర్గాలు ఏకం కావటంతో గుర్తు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై పలు దఫాలుగా విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరకు బుధవారం నిర్వహించిన సమావేశంలో పళని-పన్నీర్‌ వర్గానికే కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.

 

Similar News