బ్రిటన్ ప్రధానిపై ట్రంప్ సీరియస్ వ్యాఖ్యలు

Update: 2017-11-30 07:54 GMT

మిత్రదేశాలు అయిన అమెరికా, బ్రిటన్ ల మధ్య దూరం పెరుగుతుందా?. అంటే తాజా ప రిణామాలు ఆ దిశగానే పయనిస్తున్నట్లు కన్పిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని థెరిసా మే తాను చేసే పనులు చూడటం మానేసి..బ్రిటన్ ను కాపాడుకోవటంపై దృష్టి పెడితే చాలు అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రెండు అగ్రదేశాలకు చెందిన వ్యక్తులు ఇలా బహిరంగంగా రచ్చకెక్కడంతో ఇరుదేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ‘థెరిస్సా మే నా మీద ఫోకస్‌ చేయకు. బ్రిటన్‌లో చోటుచేసుకుంటున్న వినాశకర రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై దృష్టి పెట్టు. మేం బాగానే ఉన్నాం’ అని ట్రంప్‌ తాజాగా ట్వీట్‌ చేశారు.

                            బ్రిటన్‌కు చెందిన తీవ్ర అతివాద గ్రూప్‌ ‘బ్రిటన్‌ ఫస్ట్‌’ ట్విట్టర్‌లో పోస్టుచేసిన ముస్లిం వ్యతిరేక వీడియోను ట్రంప్‌ రీట్వీట్‌ చేయడం.. ఇటు బ్రిటన్‌లో, అటు అమెరికాలో తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంలో ట్రంప్‌ తప్పుగా ప్రవర్తించారని, ఆయన విద్వేష ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని థెరిస్సా మే తీవ్రంగా తప్పుబట్టినట్టు ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా బ్రిటన్‌ రాజకీయాల్లో ట్రంప్‌ జోక్యం చేసుకోవడం.. లండన్‌ ముస్లిం మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడంతో యూకే-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో థెరిస్సాను తీవ్రంగా తప్పుబడుతూ తాజాగా ట్రంప్‌ ట్వీట్‌ చేయడం దౌత్య ఉద్రిక్తతలు రేపుతోంది. చూడాలి ఈ దుమారం ఎటువైపు మళ్లుతుందో.

 

 

 

Similar News