ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నంది అవార్డులను ప్రకటించింది. ఇందులో 2016 సంవత్సరానికి గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడు కేటగిరీలో అవార్డు దక్కింది. జనతా గ్యారెజ్ సినిమాకు గాను ఎన్టీఆర్ కు ఈ అవార్డు దక్కింది. అయితే ఇదే ఏడాది ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం పెళ్లి చూపులు దక్కించుకుంది. 2014 సంవత్సరంలో మాత్రం ఉత్తమ చిత్రం బాలయ్య నటించిన లెజండ్ సినిమాకు దక్కింది. అదే సమయంలో ఉత్తమ నటుడు అవార్డు కూడా ఆ సినిమాలో ఆయన నటనకే కేటాయించారు. 2015 సంవత్సరానికి గాను బాహుబలి బిగినింగ్ సినిమా ఉత్తమ చిత్రం కేటగిరిలో నంది అవార్డు గెలుచుకుంది.
అయితే శ్రీమంతుడు సినిమాకుగాను ఉత్తమ నటుడు అవార్డు మహేష్ బాబుకు దక్కింది. ఈ అవార్డుల వివరాలను సినీ హీరో..తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, గిరిబాబు కూడా పాల్గొన్నారు. అదే సమయంలో 2014, 2015, 2016 సంవత్సరాలకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డులను కూడా ప్రకటించారు. ఈ అవార్డులు వరసగా కమలహాసన్, రాఘవేంద్రరావు, రజనీకాంత్ లకు ప్రకటించారు.