'వ్యాక్సిన్' చుట్టూ ఎన్నికల రాజకీయం

Update: 2020-10-22 15:07 GMT

అది అమెరికా అయినా ..భారత్ అయితే అంతే. సేమ్ టూ సేమ్. వ్యాక్సిన్ చుట్టూ రాజకీయం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్ళీ గెలిస్తేనే వ్యాక్సిన్ త్వరగా వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తారు. లేకపోతే మరింత ఆలశ్యం అవుతుందని చెబుతారు. అంతే కాదు..ఎన్నికల ముందే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని ప్రకటిస్తారు. ప్రత్యర్ధి జో బైడెన్ మార్కెట్లోకే రాని వ్యాక్సిన్ ఎక్కడ నుంచి తెస్తారు అని ట్రంప్ ను ప్రశ్నిస్తారు. భారత్ లోనూ ఇప్పుడు 'వ్యాక్సిన్ రాజకీయం' నడుస్తోంది. ఇందుకు బీహర్ ఎన్నికలు వేదికగా మారాయి. ఏకంగా బిజెపి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తే అప్పుడు బీహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. వ్యాక్సిన్ దేశానికి సంబంధించింది అని...బిజెపికి సంబంధించింది కాదని పలువురు నేతలు ఘాటుగా స్పందించారు. రాజకీయాలకు వ్యాక్సిన్ అంశాన్ని వాడుకోవటంపై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది.

ఈ అంశంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పై తమ వ్యూహాలను ప్రకటించింది. దీని బట్టి మనకు కోవిడ్ వ్యాక్సిన్ అందాలంటే రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడో తెలుసుకోవాలంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బిజెపి ప్రకటనపై మండిపడ్డారు. బీహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తే బిజెపి అధికారంలోకి లేని రాష్ట్రాల ప్రజల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. బిజెపికి ఓటు వేయని వారికి ఉచితంగా టీకా అందించరా అని నిలదీశారు. బీహార్ ఎన్నికల సందర్భంగా బిజెపి మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్ లో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని..ఎన్నికల హామీల్లో దీనికే మొదటి ప్రాధాన్యత అని ప్రకటించారు. దీనిపైనే రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. అలా బిజెపి బీహార్ లో అలా ప్రకటించిందో లేదో...తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News