వీసాల జారీలో అమెరికా కొత్త రికార్డు

Update: 2023-09-28 16:07 GMT

Full Viewఇతర దేశాలతో పోలిస్తే అమెరికా వీసా పొందటం చాలా సంక్లిష్టమైన విషయం. ఈ వీసా అంత ఈజీగా దక్కదు. దీనికి చాలా అడ్డంకులు ఉంటాయి. పర్యాటక వీసా అయినా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా వీసా జారీ సమయంలో ఆ దేశానికీ వెళుతున్న వ్యక్తి అక్కడ అక్రమంగా ఉద్యోగం చేయటం కోసం కాకుండా..నిజంగా టూరిస్ట్ పర్పస్ తోనే వెళుతున్నట్లు వీసా ఇంటర్వ్యూ సమయంలో అధికారులు నమ్మాలి. అప్పుడు మాత్రమే ఈజీ గా వీసా వస్తుంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇక అంతే. విద్యార్థుల వీసాలు అయితే డాక్యుమెంట్స్, సీటు దక్కించుకున్న యూనివర్సిటీ వంటి అంశాల ఆధారంగా ఒకింత ఈజీగా వీసాలు మంజూరు అవుతాయి. ఇది ఇలా ఉంటే భారతీయులకు అమెరికా జారీ చేస్తున్న వీసా ల విషయంలో కొత్త రికార్డు నమోదు అయింది. 2023 సంవత్సరంలో భారతీయులకు ఇప్పటివరకు జారీ అయిన వీసా ల సంఖ్య పది లక్షలు దాటింది. అంతే కాదు...ఈ ఏడాది ఇంకా కూడా కొత్త వీసా లు జారీ చేస్తామని అమెరికా ఎంబసీ అధికారులు చెపుతున్నారు. ఇదే విషయాన్నీ అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

                                                 టార్గెట్ గా పెట్టుకుని మరీ 2023 లో వన్ మిలియన్ (పది లక్షల) వీసా ల జారీ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. మిగిలిన నెలల్లో కూడా మరింత మంది భారతీయులు అమెరికాలో పర్యటించేలా వీసాలు జారీ చేస్తామని ప్రకటించారు. వన్ మిలియన్ రికార్డు పై భారత్ లో అమెరికా రాయభారి ఎరిక్ గర్సెట్టి మాట్లాడుతూ తమ ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ ఎంతో కీలకమైన దేశం అని...రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అయింది అని వెల్లడించారు. ఈ బంధాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాబోయే రోజుల్లోనూ మరిన్ని వీసాలు మంజూరు చేస్తామన్నారు. గత ఏడాది మొత్తంలో జారీ చేసిన వీసా ల కంటే ఇప్పటికే ఎక్కువ వీసాలు జారీ చేశారు. అమెరికా ప్రపంచ వ్యాప్తంగా జారీ చేసిన వీసాల్లో భారత్ కే పది శాతం దక్కాయి. విద్యార్థి వీసాల్లో భారత్ వాటా 20 శాతంగా ఉంటే...హెచ్, ఎల్ వీసాల విభాగాల్లో ఇండియా వాటా 65 శాతంగా ఉంది. 2023 సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య కొత్త రికార్డు లను నమోదు చేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

Tags:    

Similar News