మోడీ, ఎలాన్ మస్క్ భేటీ ఎఫెక్ట్ !

Update: 2025-02-18 04:14 GMT
మోడీ, ఎలాన్ మస్క్ భేటీ ఎఫెక్ట్ !
  • whatsapp icon

భారత రోడ్ల పై త్వరలోనే టెస్లా కార్లు పరుగులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఆమెరికాలో ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ...టెస్లా అధినేత ఎలాన్ మస్క్ లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే టెస్లా సంస్థ ఇండియా లో పలు నియామకాలు చేపట్టడానికి సిద్ధం అవటంతో ...ఈ కంపెనీ కార్లు త్వరలోనే భారతీయ రోడ్లపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. టెస్లా తరపున పలు నియామకాల కోసం లింక్డిన్ వేదికగా టెస్లా ప్రకటన ఇచ్చింది. దీంతో ఇండియాలో టెస్లా ఎంట్రీ కి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడుగా ఉన్న ఎలాన్ మస్క్ ఇప్పుడు ఆమెరికా ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. ఆమెరికా ఎన్నికలకు ముందే నుంచే ఆయన డోనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఎత్తున ఫండింగ్ చేసిన సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే ఎలాన్ మస్క్ కీలక పదవి దక్కుతుంది అని కూడా ట్రంప్ ముందే ప్రకటించారు. చెప్పినట్లే ఆయనకు ప్రభుత్వ సామర్ధ్యాన్ని పెంచే శాఖ (డిపార్ట్ మెంట్ అఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతలు అప్పగించారు.

                                                                          అధిక సుంకాల కారణంగా టెస్లా కార్లు భారత్ లో ఎంట్రీ కి ఆలస్యం అయింది. అందరికి ఒకేలా నిర్ణయాలు ఉంటాయి తప్ప...టెస్లా కు ప్రత్యేక రాయితీలు ఉండవు అంటూ కేంద్రం ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చింది. మరి అమెరికాలో మోడీ, ఎలాన్ మస్క్ భేటీ తర్వాత టెస్లా వేగం పెంచటంతో ఇప్పుడు దీనిపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. వాస్తవానికి గత ఎన్నికల ముందే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇండియా లో పర్యటించి కంపెనీ కార్ల యూనిట్ ఏర్పాటుపై ప్రధాని మోడీ సమక్షంలో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే ప్రభుత్వం హై ఎండ్ కార్లపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. మారిన పరిస్థితుల్లో టెస్లా కు ఇండియా లో ప్రత్యేక సౌకర్యాలు ఏమైనా కల్పిస్తారా ...అందరిలాగానే చూస్తారా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా అధిక సుంకాలపై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే తాము ప్రతీకార సుంకాలు విధిస్తామని చెపుతున్నారు.

Tags:    

Similar News