జస్టిస్ రమణపై జగన్ ఫిర్యాదులను కొట్టేసిన సుప్రీం

Update: 2021-03-24 12:45 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబర్ 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వీ రమణపై సీజెఐ ఎస్ ఏ బొబ్డేకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ ఫిర్యాదు వివరాలను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ఉన్న అజయ్ కల్లాం మీడియాకు విడుదల చేశారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తర్వాత దీనిపై పెద్ద దుమారం కూడా సాగింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ రమణపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును కొట్టేసింది. ఈ లేఖలోని అంశాలను అంతర్గతంగా పరిశీలించి...ఈ ఫిర్యాదును డిస్మిస్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్ హౌస్ పద్దతి ప్రకారం దీనిపై విచారణ సాగిందని..ఇది పూర్తిగా రహస్యంగా సాగిన వ్యవహారం అని..ఈ వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోని కీలక ప్రాంతాల్లో ముందస్తు సమాచారం తెలుసుకోవటం ద్వారా జస్టిస్ రమణ కుమార్తెలు విలువైన భూములను కొనుగోలు చేశారని..ఇది ఒక రకంగా అనుచిత ప్రయోజనం పొందటమే అని జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.

అంతే కాకుండా రమణ ప్రభావంతో ఏపీలోని కొంత మంది న్యాయమూర్తులు తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా తీర్పులు ఇస్తున్నారంటూ కూడా జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీజెఐ తాజాగా ఈ ఫిర్యాదును డిస్మస్ చేయటంతో ఈ అంశాలు అన్నీ ముగిసిన అధ్యాయంగా మిగిలిపోయినట్లే. ఇదిలా ఉంటే భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ వి రమణ పేరును ప్రస్తుత సీజెఐ కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News