గుర్తించి చెప్పినందుకు శిక్షిస్తారా?..దక్షిణాఫ్రికా ఆగ్రహం
ఒమిక్రాన్ అనే కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయంకరమైనదా?. వేగంగా వ్యాప్తి చెందుతుందా?. వ్యాక్సిన్లకు కూడా లొంగదా?. అంటూ మీడియాలో పుంఖానుఫుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎక్కడైతే ఈ కొత్త వేరియంట్ వెలుగు చూసింది అని చెబుతున్నారో ఆ దేశానికి చెందిన దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య సంస్థ చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నామకరణం చేసిన ఒమిక్రాన్ తో కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయని..కనీసం వాసన, రుచి పోవటం వంటి లక్షణాలు కూడా లేవని స్పష్టం చేసింది. రెండు రోజులు నీరసంతోపాటు కొద్దిగా దగ్గు ఉంటుందని తెలిపారు. మరి ఇంత స్పల్ప లక్షణాలు ఉన్న వేరియంట్ తో ప్రపంచాన్ని మళ్లీ గడగడలాడించటం వెనక మతలబు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. కేవలం బూస్టర్ డోసులు..వ్యాక్సిన్ల అమ్మకాల వేగం పెంచేందుకు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ వార్త అలా వచ్చిందో లేదో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ మోడెర్నా షేర్లు శుక్రవారం నాడు ఏకంగా 20 శాతం మేర లాభపడ్డాయి.
కొత్త వేరియంట్ పై జాగ్రత్తగా..అప్రమత్తంగా ఉండటం తప్పులేదు కానీ..తీవ్ర భయాందోళనలు ఏర్పడేలా చేయటం మాత్రం సరికాదని కొంత మంది వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సిన డబ్ల్యూహెచ్ వో కోవిడ్ విషయంలో తొలి నుంచి ఎన్ని పిల్లిమొగ్గలు వేసిందో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు స్పందిస్తున్న తీరుపై .దక్షిణాఫ్రికా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ముందుగా కొత్త వేరియంట్ ను గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసినందుకు మాకు శిక్ష విధిస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమాన రాకపోకలను నిషేధించటాన్ని తప్పుపట్టింది. ప్రపంచానికి చెందిన అంతర్జాతీయ సంబంధాలు, సహకార శాఖ (డీఐఆర్ సీవో) ఓ ప్రకటన విడుదల చేస్తూ సరైన మదింపు లేకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం సరికాదని పేర్కొంది. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ణానం ద్వారా తాము కొత్త వేరియంట్ ను గుర్తించి అందరినీ అప్రమత్తం చేస్తే పలు దేశాలను ట్రావెల్ బ్యాన్ పెట్టడం ఏ మాత్రం సరికాదని పేర్కొంది.
పలు దేశాలు ఇప్పటికే కొత్త వేరియంట్స్ ను గుర్తించాయని..అయితే దక్షిణాఫ్రికా కనుగొన్న కొత్త వేరియంట్ తో దేనికి లింక్ లు లేవన్నారు.కానీ ఇతర దేశాల వేరియంట్స్ తో పోలిస్తే తమ దేశంలోని వేరియంట్ పై పలు దేశాలు స్పందించిన తీరు మాత్రం తేడాగా ఉందని వెల్లడించింది. తాము పలు దేశాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. ప్రతి దేశం..తమ తమ దేశాల్లో ప్రజలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవటం సరైనదే అని..అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవటానికి నైపుణ్యాలను పంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే అసలు ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది..దాని తీవ్రత వంటి విషయాలపై ఇంకా పూర్తి స్థాయి పరీక్షలు పూర్తవలేదు. కానీ దక్షిణాఫ్రికా మాత్రం ఈ వేరియంట్ లక్షణాలు మాత్రం చాలా స్వల్పమే అని స్పష్టం చేస్తోంది. కానీ భయం మాత్రం మళ్ళీ మరో వేవ్ తప్పదు అనే స్థాయిలో సాగుతున్నాయి. మరి ఇది ఎక్కడ వరకు వెళుతుందో వేచిచూడాల్సిందే.