దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్లు తొలి రోజే నిరాశపర్చాయి. ఈ షేర్లు మంగళవారం నాడు బీఎస్ఈ, ఎన్ ఎస్ఈల్లో లిస్ట్ అయ్యాయి. ఆఫర్ ధర కంటే తక్కువ ధర వద్ద ట్రేడ్ అవటంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు.బీఎస్ఈలో ఈ షేరు ఆఫర్ దర కంటే 8.62 శాతం తక్కువగా 867 రూపాయల వద్ద ట్రేడింగ్ ప్రారంభం అయింది. ఎన్ఎస్ఈలో మాత్రం 8.11 శాతం తక్కువ ధరతో 872 రూపాయల వద్ద లిస్ట్ అయింది. మంగళవారం ఉదయం 10.15 గంటల సమయంలో బీఎస్ఈలో ఈ షేరు 899.50 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్ఐసీ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవటం విశేషం.ఐపీవో ద్వారా ఎల్ ఐసీ మార్కెట్ నుంచి 2060 కోట్ల రూపాయలు సమీకరించింది.
ఇప్పటి వరకూ దేశంలో ఇదే అతి పెద్ద ఐపీవో కావటం విశేషం. ప్రీ ట్రేడింగ్ సెషన్ లో ఎల్ ఐసీ షేర్లు ఆఫర్ ధర కంటే భారీ డిస్కౌంట్ తో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈలో అయితే ఏకంగా 119 రూపాయల నష్టంతో 830 వద్దతో ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి ఎల్ ఐసి విలువను ప్రైవేట్ రంగంలోని ఇతర బీమా కంపెనీల విలువలతో పోలిస్తే చాలా తక్కువ చేసి చూపించారని..ఇది దోపిడీనే అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఎల్ ఐసీ షేర్లు తొలి రోజు భారీ డిస్కౌంట్ ధరతో ట్రేడ్ అవటం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశంలో నెలకొన్న ఆర్ధిక అంశాలు ఎల్ ఐసీ లిస్ట్ంగ్ పై ప్రభావం చూపించాయని నిఫుణులు అంచనా వేస్తున్నారు. ఎల్ ఐసీ షేరు ధరను 949 రూపాయలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.