ఇండిగో ఫ్లైట్ లో షాకింగ్ ఘటన

Update: 2024-01-15 07:23 GMT

Full Viewవిమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన తరచూ చూస్తూనే ఉంటాం. దేశీయ విమాన సర్వీస్ లతో పాటు అంతర్జాతీయ మార్గాల్లో కూడా ఇలాంటి ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రయాణికులు సిబ్బందితో ఘర్షణ పడతారు...కొన్ని సార్లు వాళ్లపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇది మాత్రం అసాధారణం అనే చెప్పాలి. సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు ఈ సారి ఏకంగా విమాన పైలట్ పైనే దాడికి దిగాడు. ఇండిగో విమానంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం మరింత ఆలస్యం అవుతుంది అని పైలట్ ప్రకటన చేస్తున్న సమయంలో తన సీట్ లో నుంచి లేచి అత్యంత వేగంగా వచ్చిన ప్రయాణికుడు పైలట్ పై దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన విమానం తీవ్రమైన పొగమంచు కారణంగా ఏకంగా పదమూడు గంటలు ఆలశ్యం అయింది. దీంతో సహనం కోల్పోయిన ఆ ప్రయాణికుడు ఏకంగా పైలట్ పైనే ఎటాక్ చేశాడు.

                                    ఉత్తరాదిలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వందల విమానాలు జాప్యం అవుతున్నాయి. ఏ విమానం అయినా కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటిసి) నుంచి అనుమతి వస్తే తప్ప టేకాఫ్ , ల్యాండింగ్ కు ఛాన్స్ ఉండదు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా రన్ వే విజిబిలిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అనుమతి ఇస్తారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో పైలట్ పై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేయగా..పోలీస్ లు దాడికి పాల్పడిన వ్యక్తిని విమానం నుంచి దింపేసి అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో పైలట్ పై ప్రయాణికుడి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పొగమంచు కారణంగా విమానాల్లో విపరీత జాప్యం చోటు చేసుకుంటుండటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News