ఒమిక్రాన్ భార‌త్ కూ వ‌చ్చింది

Update: 2021-12-02 12:30 GMT

క‌ర్ణాట‌క‌లో రెండు కేసులు న‌మోదు

ఆందోళ‌న అక్క‌ర్లేదు..జాగ్ర‌త్త‌గా ఉంటే చాలు

ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డో ఉందిలే అనుకున్నారు. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. భార‌త్ లోకి కూడా క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ‌చ్చేసింది. క‌ర్ణాట‌క‌లో రెండు కేసులు వెలుగుచూసిన‌ట్లు కేంద్రం అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. అయితే ఎక్కువ మంది నిపుణులు చెబుతున్న‌ది ఈ వేరియంట్ పై ఎవ‌రూ పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని..జాగ్ర‌త్త‌గా ఉంటే చాలు అని చెబుతున్నారు. అయితే ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారం రావ‌టానికి ఇంకా కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఓ వైర‌స్ సోకుతుంది. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కూడా ఈ వేరియంట్ పై ప‌నిచేస్తున్నాయ‌ని చెబుతుండ‌టం ఓ సానుకూల ప‌రిణామం. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ వెల్ల‌డించారు.

వైరస్‌ సోకిన ఇద్దరు పురుషుల్లో ఒకరికి 46, మరోకరికి 66 సంవ‌త్స‌రాలు అని కేంద్రం తెలిపింది. వైరస్‌ సోకిన ఇద్దరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో తరలించినట్లు వెల్ల‌డించారు. ఒమిక్రాన్‌ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ ట్రేస్‌ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. వీరిద్దరిలో తీవ్రమైన లక్షణాలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేరళ, మహారాష్ట్రలలో 10,000 కంటే ఎక్కువ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. దేశంలోని 55 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లో నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటికే ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 29 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగుచూడగా, 373 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు.

Tags:    

Similar News