కేంద్రంలోని మోడీ సర్కారు అడ్డగోలుగా పెరుగుతున్న పెట్రో ధరలపై చేతులెత్తేస్తోంది. ధరలకు తమకు సంబంధం లేదని..లేదంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలని సూచిస్తూ వదిలేసింది. దీంతో ప్రతి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు వంద రూపాయలు దాటేసింది. పెరుగుతున్న ఈ ధరలపై ప్రజలు..వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ఉత్పత్తి తగ్గటం వల్లే ధరలు పెరిగాయని ఒకరు..ఇది గత ప్రభుత్వాల పాపమే అని మరొకరు చెబుతూ పోతున్నారు తప్ప..పెరిగే ధరలకు పరిష్కారం చూపే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ధరలపై స్పందించారు. ఇది కేవలం వాహనదారులపై భారం మోపటమే కాకుండా..అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ఈ ధరలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పెరుగుదల తయారీ, రవాణా రంగాలను తీవ్రం గా దెబ్బతీస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాపార వ్యయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. మరోవైపు డిజిటల్ కరెన్సీ ఆవిష్కారంపై తాము కసరత్తు చేస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు. డిజిటల్ రెవల్యూషన్‌లో తాము వెనకబడి ఉండాలనుకోవడం లేదంటూ క్రిప్టోకరెన్సీ లాంచింగ్‌పై ఇప్పటివరకు వస్తున్న అంచనాలపై క్లారిటీ ఇచ్చారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి.. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి తమకు ఆందోళనలు ఉన్నామని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు.