జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఏఐఎల్)కు సంబంధించి కీలక పరిణామం. ఈ విమానాశ్రయానికి సంబంధించిన రాయితీ ఒప్పందాన్ని 2068 మార్చి 22 వరకూ పొడిగించటానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న ఒప్పందం గడువు 2038 మార్చి 23 వరకూ ఉంది. ఇది అంతా కూడా నిర్మాణ సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం జరిగినా కూడా ఇన్ని సంవత్సరాల ముందు ఈ గడువు పెంపు ఎందుకు జరిగింది అన్నది ఆసక్తికరంగా మారింది. సహజంగా ఒప్పందం పూర్తయ్యే రెండు, మూడేళ్ల ముందు దరఖాస్తు చేసుకోవటం..అంగీకరించటం సహజంగా జరిగిపోతుంది.
అది కూడా ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే కాబట్టి. కానీ ఏకంగా 16 సంవత్సరాల ముందే ఈ ఒప్పందానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని జీఎంఆర్ బుధవారం నాడు స్టాక్ ఎక్స్చేంజ్ లకు తెలియజేసింది. 2004 డిసెంబర్ 20న జరిగిన రాయితీ ఒప్పందం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలే జీఎంఆర్ గ్రూప్ విమానాశ్రయాల వ్యాపారం, విద్యుత్, మౌలికసదుపాయాల కంపెనీలను వేర్వేరుగా చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విమానాశ్రయాల వ్యాపారం మొత్తం జీఎంఆర్ ఇన్ ఫ్రా చేతిలో ఉంది.2008 మార్చిలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది.