విలవిలలాడుతున్న తెలుగు యువత !

Update: 2025-02-06 11:08 GMT
విలవిలలాడుతున్న తెలుగు యువత !
  • whatsapp icon

భారీ వరదలు..తుఫాన్లు వచ్చి పోయాక బాధిత ప్రాంతాల్లో ఉన్న బంధువులు..స్నేహితులను అందరూ ఫోన్లు చేసి పరామర్శిస్తారు. ఇప్పుడు ఎలా ఉంది..అంతా ఒకే కదా...ఏమి ఇబ్బంది లేదు కదా అని అరా తీస్తారు. ఇప్పుడు అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఒక తుఫాన్ గా మారాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున యువత చదువుతో పాటు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికాలో తెలుగు వాళ్లకు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ తుఫాన్ కూడా పెద్ద ఎత్తునే తగిలింది అని చెప్పొచ్చు. అయితే ఇది ఎప్పటికి ఆగుతుంది...అప్పటి వరకు అమెరికా లో ఉన్న విద్యార్థులు ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారు అన్నది ఒక ఛాలెంజ్ గా మారింది అనే చెప్పాలి. అందుకే చాలా మంది ట్రంప్ వచ్చాక మీ వాడి పరిస్థితి ఎలా ఉంది...మీ అమ్మాయి జాబ్ కి దొరికిందా అంటూ అరా లు తీసుకుంటున్నారు.

                                                                    అమెరికాలో పిల్లలు ఉన్న పేరెంట్స్ పరిస్థితి వీళ్లకు సమాధానం చెప్పుకోలేక నానా తంటాలు పడుతున్నారు ఇప్పుడు. నిబంధనలకు విరుద్ధం అయినా కూడా అమెరికా లో చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు, పార్ట్ టైం జాబ్ లు చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే ఎక్కడ పట్టుబడినా కూడా వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ట్రంప్ సర్కారు వెనక్కి పంపిస్తుంది అనటంలో సందేహం లేదు. అందుకే చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలు చేయలేక...ఖర్చులు భరించలేక టెన్షన్ టెన్షన్ తో కాలం గడుపుతున్నారు.

                                                అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నంత కాలం విద్యార్థులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, పార్ట్ టైం జాబ్స్ చేసుకుని తమ ఖర్చులకు అవసరమైన మొత్తాలను సంపాదించుకునే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతోనే ఇప్పుడు అమెరికా లో చదువు చివరి దశకు చేరిన వాళ్ళతో పాటు ఉద్యోగాల కోసం వెయిటింగ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఒకింత ఆందోళన కరంగా మారింది. ఉద్యోగం వస్తే ఓకే...లేకపోతే అక్కడ ఎక్కువ కాలం ఉండే ఛాన్స్ లేదు అనే చెప్పాలి. చట్టబద్దమైన వీసా ఉన్నా కూడా తల్లి తండ్రులపై ఆధారపడి..ఇండియా నుంచి డబ్బులు తీసుకు వెళ్లి అక్కడ ఎక్కువ కాలం ఉండటం అన్నది జరిగే పని కాదు అనే చెప్పొచ్చు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వాళ్ళను డోనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రత్యేక విమానాల్లో మరీ వారి వారి దేశాలకు తరలిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు భారత్ కు చెందిన చాలా మంది ట్రంప్ తుఫాన్ లో చిక్కుకున్నట్లు అయింది. ఆర్థికంగా పర్వాలేదు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఓకే కానీ..ఖర్చులకు అక్కడ ఎలాగైనా పార్ట్ టైం జాబ్స్ చేసుకుందాం అనే లెక్కలతో వెళ్లిన వాళ్ళకే ఇప్పుడు మరింత ఇబ్బంది అని చెప్పాలి.

Tags:    

Similar News