ఆయనో జిల్లా జడ్జి. మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆటో ఆయన దగ్గరకు రాగానే పక్కకు వచ్చి గుద్దేసింది. ఆ దెబ్బకు ఆయన కిందపడిపోయారు. ఇది చూసి కూడా ఆ ఆటో ఏ మాత్రం ఆగలేదు. అంతే కాదు..ఎంచక్కా రోడ్డుపై దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటే్జ్ చూసిన వారెవరికైనా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందనే విషయం తెలిసిపోతుంది. ఈ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. ఈ వ్యవహరం ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ధన్‌బాద్ జిల్లా అడిషినల్, సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ఉదయం మేయిన్ రోడ్డుపై జాగింగ్ చేస్తున్నారు. సరిగ్గా ఆ ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో వెనకాలనుంచి ఆయనను ఢీకొట్టింది.
దీంతో ఆయన పక్కకు ఎగిరి పడ్డారు. రోడ్డు ప్రక్కన పడి ఉన్న ఆయనను గుర్తించిన కొందరు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారటమే కాకుండా.. పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు దీన్ని హత్యగా అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆటోతో ఢీకొట్టి చంపినట్లు భావిస్తున్నారు. మాజీ ఏఎస్‌జీ వికాస్‌సింగ్.. జడ్జి ఆనంద్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు ఆనంద్ మృతిపై సుమోటో కేసును స్వీకరించింది.