భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిపెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ఇక లేరు. ఆయనతోపాటు ఆయన భార్య మధులిక రావత్ కూడా దుర్మరణం పాలయ్యారు.. బుధవారం నాడు తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో వీరు మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బిపిన్ రావత్ కు చికిత్స అందిస్తున్నారని తొలుత వార్తలు వచ్చినా బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బిపిన్ రావత్ మరణించారన్న విషయాన్ని అదికారికంగా ప్రకటించింది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఏకంగా 13 మంది మరణించారు. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. తొలుత 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బిపిన్ రావత్‌కు వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత కారణంగా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో డీఎన్‌ఏ టెస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు.వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చారు. మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురయ్యారు.
అయితే ఈ ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం జరగటానికి గల కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై విచారణ సాగనుంది. ఇది ప్రమాదమా లేక ఇందులో ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలోనూ విచారణ చేయనున్నారు. దేశ భద్రతా దళాలకు సంబంధించి అత్యున్నత పదవిలో ఉన్న బిపిన్ రావత్ ప్రయాణించే హెలికాప్టర్ అత్యంత పకడ్భందీగా ఉండటంతోపాటు..అందులో పైలట్లు కూడా సుశిక్షితులై ఉంటారు. అలాంటిది వాతావరణం అంతా సాఫీగా ఉన్న వేళ ప్రమాదం జరగటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రాధమిక సమాచారం మేరకు మాత్రం సాంకేతిక సమస్యలే ప్రమాదానికి కారణం అని పేర్కొంటున్నారు. రావత్ ప్రమాదంలో కన్నుమూసిన ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ స్పందించారు. దేశ రక్షణ దళాల బలోపేతం కోసం ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. రాజ్ నాథ్ సింగ్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులు రావత్ మరణంపై ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.