దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) చైయిన్ అయిన బర్గర్ కింగ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బుధవారం నాడు ప్రారంభం అయింది. ఈ ఇష్యూ డిసెంబర్ 4న ముగియనుంది. కంపెనీ షేర్ ధరను 59-60 రూపాయలుగా నిర్ణయించింది. భారత్ లో తొలి ఐదేళ్ళ కార్యకలాపాల తర్వాత ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఒక్కోటీ పది రూపాయల ముఖ విలువతో ఈ షేర్లను జారీ చేస్తున్నారు.
ఈ ఇష్యూలో ధరఖాస్తు చేసే వారు కనీసం 250 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పైన కూడా అదే లెక్కన ఎన్ని షేర్లు అయినా దరఖాస్తు చేయవచ్చు. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 810 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బర్గర్ కింగ్ షేర్లు డిసెంబర్ 14న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.