విమానయానం త్వరలోనే భారం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలతో ఎయిర్ లైన్స్ ఛార్జీల పెంపు దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. కరోనాతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ లైన్స్ సొంతంగా ఈ భారాన్ని భరించే పరిస్థితిలో లేవు. దీంతో పెరిగిన ఏటీఎఫ్ ధరలకు అనుగుణంగా ఛార్జీల్లో మార్పులు అనివార్యం అని భావిస్తున్నారు.ఏటీఎఫ్ ధరలు 5.2 శాతం పెరగటం ద్వారా భారత్ లో ఇవి రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. కేవలం రెండు నెలల వ్యవధిలో ఆయిల్ కంపెనీలు నాలుగుసార్లు ఏటీఎఫ్ ధరలను పెంచాయి.
అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ దరల కారణంగానే ఎటీఎఫ్ ధరలు పెరిగాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ లోనే ఏటీఎఫ్ పై అత్యధిక పన్నులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర 86038 రూపాయల నుంచి 90519 రూపాయలకు పెరిగింది. మెట్రో నగరాలు అయిన కలకత్తా, ముంబయ్, చెన్నయ్ ల్లోనూ పెరుగుదల నమోదు అయింది. ఇప్పటికే ఆర్ధికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎయిర్ లైన్ కంపెనీలను ఇది మరింత ఒత్తిడికి గురిచేస్తుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.