జైలు లో సీఎం గా..జైలు బయట...!

Update: 2024-09-15 08:13 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జైలు లో ఉన్నంత కాలం సీఎం పదవికి రాజీనామా చేయని ఆయన..బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మాత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి అటు ఈడీ, ఇటు సిబిఐ కేసుల్లోనూ బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్ట్ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినా కూడా సీఎం హోదాలో ఆయన సచివాలయాన్ని వెళ్ళటానికి వీలు లేదు అని...ఫైల్స్ పై సంతకం కూడా చేయకూడదు అని కోర్ట్ ఆంక్షలు విధించింది.

                                                        ఏ ఫైల్ పై అయినా సంతకం చేయాలి అంటూ ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఇది జరిగే పని కాదు అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది అంటే 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం సీఎం గా ఉన్న కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆప్ నుంచి మరో నేతను సీఎం చేసి ..ఆయన పూర్తి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించబోతున్నారు. రాజీనామా ప్రకటన చేస్తూ తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ సీఎం పదవిలో ఉండను అంటూ వెల్లడించారు. త్వరలోనే సమావేశం పెట్టి కొత్త సీఎం ను ఎంపిక చేస్తామని తెలిపారు. అప్ లో చీలికలు తెచ్చి ఢిల్లీ లో ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ చేసిన కుట్రలను సాగనివ్వలేదు అన్నారు.

                                                   తనను జైలు పాలు చేసి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రాజ్యాంగాన్ని రక్షించటానికే సీఎం పదవికి రాజీనామా చేయలేదు అన్నారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన పూర్తి రాజకీయ కోణంలో సాగినట్లు స్పష్టం అవుతోంది. నిజంగా ఆయన విలువలు పాటించి ఉంటే ..ఎప్పుడైతే జైలు కు వెళ్లారో అప్పుడే తన పదవికి రాజీనామా చేసి ఉండేవాళ్ళు అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కానీ అలా చేయకుండా...బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం అంటే ఎన్నికల్లో లబ్దిపొందటానికే ఈ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే నిర్దోషిగా నిరూపించుకునే వరకూ తాను సీఎం పదవి చేపట్టబోను అని కేజ్రీవాల్ చెపుతున్నారు. అంటే కోర్ట్ లు ఆయన నిర్దోషిత్వాన్ని తేల్చే వరకా..లేక ఎన్నికల ఫలితాల వరకా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.

Tags:    

Similar News