సోమవారం కొత్త కంపెనీల లిస్టింగ్ హడావుడి

Update: 2024-09-14 14:34 GMT

గత కొంతకాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో సెకండరీ మార్కెట్ తో పాటు ప్రైమరీ మార్కెట్ హవా కూడా కొనసాగుతోంది. పలు ఐపీఓ లు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఐపీఓ అంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనే చెప్పొచ్చు. ఈ కంపెనీ 6500 కోట్ల రూపాయల విలువ గల షేర్లను విక్రయానికి పెట్టగా..దీనికి ఏకంగా 3 .2 లక్షల కోట్ల రూపాయల విలువైన బిడ్స్ వచ్చాయి. ఈ ఇష్యూ కి ఇన్వెస్టర్లలో ఎంత క్రేజ్ ఉందో దీనికి వచ్చిన బిడ్స్ చూసి అర్ధం చేసుకోవచ్చు. ఈ ఇష్యూ 63 .6 రేట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు సోమవారం అంటే సెప్టెంబర్ 16 న బీఎస్ఈ తో పాటు ఎన్ఎస్ఈ లో లిస్ట్ కానున్నాయి. తొలి రోజే ఈ షేర్లు కొత్త కొత్త రికార్డు లు నమోదు చేసే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల గ్రే మార్కెట్ ప్రైస్ (జీఎంపీ) భారీగా ఉండటమే.

ఈ కంపెనీ ఇష్యూ ధరను 70 రూపాయలుగా నిర్ణయిస్తే...79 రూపాయల లాభంతో అంటే..మొత్తం మీద ఈ షేర్లు 149 రూపాయల వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. జీఎంపీ లెక్కల ప్రకారం చూస్తే లిస్టింగ్ లోనే ఇన్వెస్టర్లకు 110 ప్రతిఫలం ఉండొచ్చని భావిస్తున్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తో పాటు సోమవారం నాడే క్రాస్ లిమిటెడ్, పీఎన్ గాడ్గిల్ జూవెలర్స్, టోలిన్స్ టైర్స్ వంటి కంపెనీలు కూడా లిస్టింగ్ కు రానున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చే సోమవారం స్టాక్ మార్కెట్ లో కొత్త కంపెనీల లిస్టింగ్ హడావుడి పెద్దఎత్తున ఉండబోతోంది. 

Tags:    

Similar News