ఎవ‌రూ ఇంథ‌నం అమ్మ‌క చిక్కుకుపోయిన ర‌ష్యా నౌక‌

Update: 2022-03-19 09:00 GMT

ఉక్రెయిన్ పై అడ్డగోలుగా దాడుల‌కు దిగుతున్న రష్యా సైతం ఇప్పుడు చిక్కుల్లో ప‌డుతోంది. సంప‌న్నుల ద‌గ్గ‌ర నుంచి సామాన్యుల వ‌ర‌కూ ఈ ప్ర‌భావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇందుకు కార‌ణం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు ర‌ష్యాపై ఆంక్షలు విధించ‌ట‌మే. తాజాగా అలాంటిదే విచిత్ర‌మైన వ్య‌వ‌హారం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ర‌ష్యాకు చెందిన అలిగాక్ సూప‌ర్ యాచ్ ఒక‌టి నార్వేలో చిక్కుకుపోయింది. దీనికి కార‌ణం ఏంటో తెలుసా?. ఈ నౌక‌కు ఎవ‌రూ ఇంథ‌నం అమ్మటానికి సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌ట‌మే. ఇప్పుడు ఈ అత్యంత విలాస‌వంత‌మైన నౌక నార్వే పోర్టులో నిలిచిపోయింది. ఈ యాచ్ విలువ 85 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉంటుంద‌ని, ఇది వ్లాదిమిర్ స్ట్రాజోవిస్కిది అని స‌మాచారం. అయితే యాచ్ కెప్టెన్ మాత్రం ఈ ఓడలో సిబ్బంది ఎవ‌రూ ర‌ష్య‌న్లు లేర‌ని..అయినా కూడా ఇలా వివ‌క్ష చూపించ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని వాపోతున్నారు.

ర‌ష్యాకు చెందిన చాలా మంది సంప‌న్నుల ప‌రిస్థితి కూడా అయోమ‌యంగా త‌యారైంది. కోట్లాది డాల‌ర్ల ఆస్తులు ఉన్నా వాటిని వాడుకునే అవ‌కాశం లేకుండా పోయింది. ఇందుకు కార‌ణం అమెరికాతోపాటు ప‌లు యూరోపియ‌న్ దేశాలు ర‌ష్యాపై ఆంక్షలు విధించ‌ట‌మే కార‌ణం. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు ప్రారంభించి చాలా రోజులు అయినా ఇప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఫ‌లితాలు రాబ‌ట్ట‌డంలో పుతిన్ విఫ‌లం అయ్యారు. దీంతో ఆయ‌న‌పై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ర‌ష్యా ప్ర‌జ‌ల్లో కూడా నిర‌స‌న సెగ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అందుకే పుతిన్ ఇప్పుడు సాధ్య‌మైనంత వేగంగా ఈ యుద్ధానికి ముగింపు ప‌ల‌కాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ర‌ష్యా దాడుల వ‌ల్ల ఉక్రెయిన్ లో భారీగా ఆస్తి న‌ష్టం..ప్రాణ‌న‌ష్టం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ర‌ష్యా సైనికుల‌ను కూడా ఉక్రెయిన్ భారీగానే హ‌త‌మార్చింది.

Tags:    

Similar News