హుజూరాబాద్ పై ఎన్ని సమీక్షలు అయినా చేస్తారు
ఆరేళ్ళ గిరిజన బాలిక రేప్ కు గురైతే పట్టించుకోరా?
ఇంత కంటే మానవ మృగం మన మధ్య ఉంటుందా?
సీఎం కెసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ వేదికగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో శుక్రవారం రాత్రి దళిత, గిరిజన దండోరా సభ జరిగింది. ఈ సభలో మాట్లాడిన రేవంత్ ప్రభుత్వంపై..ముఖ్యమంత్రి కెసీఆర్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కెసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎన్నిసార్లు అయినా సమీక్షలు చేస్తారు కానీ...హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల గిరిజన బాలికపై దారుణంగా అత్యాచారం జరిగి..హత్యకు గురైతే సీఎం కెసీఆర్ సమీక్ష చేసి..చర్యలకు ఆదేశించలేరా? అని ప్రశ్నించారు. ఇంత కంటే మానవ మృగం మన మధ్య ఉంటదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులకు కెసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ , కొడుకు డ్రామారావు డ్రగ్స్ తీసుకునేవారికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఈడీ చుట్టూ తిరుగుతున్నతి సినిమా వాళ్లకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. తెలంగాణ సమాజం, పిల్లలు, యువత డ్రగ్స్ కు బానిస కాకుండా చూడాల్సిన సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. వ్యాపారం కోసమే కెసీఆర్ కుటుంబం బతుకుంది అంటూ మండిపడ్డారు. తాజాగా కోర్టులో అఫిడవిట్ వేశారని, డ్రగ్స్ కు సంబంధించి తమ దగ్గర సమాచారం లేదని చెప్పారన్నారు.
రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. తమ ఆవేదన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసమేనన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'రాజకీయంగా ఎన్నోత్యాగాలు చేసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే ఎవడి పాలు అయిందో ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరి అయ్య జాగీరు అని కెసీఆర్ కు వందల ఎకరాలు వచ్చాయి. అటుకులు తిని ఉద్యమం చేసిన అని చెప్పిన కెసీఆర్ కు ఎక్కడ నుంచి ఇన్ని ఆస్తులు వచ్చాయి . నీ వ్యాపార మెళకులు ఏవో దళిత, గిరిజనులకు నేర్పు. తెలంగాణ అంటే గడీల కోటలు బద్దలు కొట్టిన గడ్డ. తెలంగాణ ను పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబం నుంచి దీనికి రక్షణ కల్పించాలి. తుది దశ తెలంగాణ ఉద్యమం కోసం కార్యకర్తలు అంకితం కావాలి. పోరాటం చేసిన వారికి గుర్తింపు ఉంటుంది..గుర్తింపు కార్డు ఉంటుంది. వారిని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. బూత్ కు తొమ్మిది యువకులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. ఈ 18 నెలలు పోరాడాలి. మద్యం ద్వారా 36 వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న నీచుడు, నికృష్డుడు తాగుబోతు కెసీఆర్. గొర్రెలు..బర్రెలు..పందుల పిల్లలు మీ కుటుంబంలో పెట్టుకో. దళిత, గిరిజన పిల్లలకు మంచి చదువులు..ఉద్యోగాలు కావాలి. తెలంగాణలో స్వేచ్చ లేదు..సామాజిక న్యాయం లేదు. గజ్వేల్ లో ఔటర్ రింగు రోడ్డు అని ఏడేళ్ళు అయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 12 శాతం ఉన్న మాదికలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చావా? అర శాతం ఉన్న మీ కుటుంబానికి నాలుగు మంత్రి పదవులా. మీ ఇంటిల్లి పాదికి పదవులు ఉంటాయి. 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క పదవి ఇవ్వవా?.తెలంగాణ ఇస్తే విలీనం చేస్తానని సోనియాను మోసం చేసిన దగుల్బాజీ కెసీఆర్. కెసీఆర్ సీఎం అయితే గజ్వేల్ డెవలప్ అవుతుందని అనుకున్నారు. కానీ జరిగింది శూన్యం. కెసీఆర్ పేదల భూములు లాక్కుని ప్రాజెక్టులు కట్టాడు. నిర్వాసితులను నిండా ముంచారు. కెసీఆర్ సీఎం అయితే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయని అనుకున్నారు. నిరుద్యోగ భతి అయినా వస్తుందనుకున్నారు. కానీ ఏదీ రాలేదు. గజ్వేల్ గడ్డ మీద కదం తొక్కుతా అని చెప్పా.
చెప్పినట్లు లక్ష మందికిపైగా వచ్చాం. కెసీఆర్ కు లక్ష సరిపోదు అని రెండు లక్షల మంది వచ్చారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కతున్న కెసీఆర్ కు బుద్ధిచెప్పేందుకు ఈ సభ. పేదోళ్ళకు చదువును దూరం చేసిన నీచుడు, నికృష్ణుడు కెసీఆర్. తెలంగాణ డీజీపీ, సీపీని నేను ఓ మాట అడుగుతున్నా. లక్షల కెమెరాలు పెడితే ఆరు సంవత్సరాల పాపను దారుణంగా రేప్ చేసి..చంపేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు. మీరు దద్దమ్మలు కాదా?. నేరానికి పాల్పడిన వాడు చనిపోయే వరకూ అరెస్ట్ చేయలేదంటే అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని అడుగుతున్నా.ఇసుక దోపిడీ అని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేసి వేధిస్తారు. కెసీఆర్ కు ఘోరీ కట్టాలి. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం..కళ్లు తెరిస్తే కెసీఆర్ కాలిపోతారు. నిరుద్యోగ యువత కోసం ధర్మయుద్ధం చేస్తాం. ఫాంహౌస్ లో పండిస్తున్నది పంట కాదు..అవినీతి తోట. బిడ్డా 19 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడతాం.' అని వ్యాఖ్యానించారు.